లంచం తీసుకుని.. తిరుమలకు నెయ్యి ట్యాంకర్ల అనుమతి!
ABN , Publish Date - Feb 07 , 2026 | 05:35 AM
తిరుపతి జిల్లా తిరుచానూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి టి.జానకిరామ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. దా
తిరుచానూరు మార్కెట్ కమిటీ కార్యదర్శి గుట్టు రట్టుచేసిన సిట్
తిరుచానూరు, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా తిరుచానూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి టి.జానకిరామ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. దానితోపాటు అతడిపై శాఖాపరమైన చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. సెస్ వసూలు చేయకుండా లంచం తీసుకుని నెయ్యి ట్యాంకర్లను తిరుమలకు అనుమతించాడని సీబీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించింది. దీంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే డెయిరీ సంస్థలు నెయ్యి టాంకర్లను తిరుమలకు పంపిస్తుంటాయి. అలా వెళ్లే టాంకర్ల నుంచి అలిపిరి చెక్ పాయింట్ వద్ద తిరుచానూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బంది నిబంధనల మేరకు సెస్ వసూలు చేయాల్సి ఉంటుంది.
ట్యాంకర్ల సామర్థ్యాన్ని బట్టి రూ.40 వేల నుంచి 70 వేల దాకా సెస్ కింద వసూలు చేయాలి. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో మార్కెట్ కమిటీ సిబ్బంది సెస్ వసూలు చేయకుండా ఒక్కో ట్యాంకర్ నుంచి కనిష్ఠంగా 8 వేలు, గరిష్ఠంగా 15 వేల వరకు లంచాలు వసూలు చేసి వాటిని తిరుమలకు అనుమతించారు. భోలేబాబా డెయిరీకి కమీషన్ ఏజెంటుగా పనిచేసిన పీపీ శ్రీనివాసన్‌ను సిట్ విచారించిన క్రమంలో ఈ అంశం వెలుగు చూసింది. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న డెయిరీలో మార్కెట్ కమిటీ సిబ్బందికి చెల్లించిన లంచాల వివరాలు ఉన్నాయి. దీనిపై సిట్ అధికారులు గత నెల 24వ తేదీన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌కు లేఖ రాశారు. సిట్ లేఖ ఆధారంగా కార్యదర్శి జానకిరామ్‌ను బాధ్యుడిగా గుర్తించిన వ్యవసాయ మార్కెట్‌శాఖ డైరెక్టర్ అతడిని సస్పెండ్ చేశారు. అలాగే సెస్ బదులు లంచం వసూలు చేసిన కాంట్రాక్టు కార్మికుడు రాధాకృష్ణను తొలగించేందుకు నోటీసు జారీ చేశారు.