Share News

అసలు తప్పే జరగలేదని బొంకడం శోచనీయం: టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం

ABN , Publish Date - Feb 07 , 2026 | 06:23 AM

మనందరం అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన వారు.. చెడుపదార్థాలు కలిపి స్వామికి తినిపించారు. ఇప్పుడు అసలు తప్పే జరగలేదన్నట్లు బొంకడం శోచనీయం. అని టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు..

అసలు తప్పే జరగలేదని బొంకడం శోచనీయం: టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం

  • తప్పు చేసిన వారిలో చిత్తశుద్ధి కనిపించలేదు

  • డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే చేశారు

  • తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యిపై టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6(ఆంధ్ర జ్యోతి): ‘‘మనందరం అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన వారు.. చెడుపదార్థాలు కలిపి స్వామికి తినిపించారు. ఇప్పుడు అసలు తప్పే జరగలేదన్నట్లు బొంకడం శోచనీయం.’’ అని టీటీడీ మాజీ ఈవో, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. శ్రీవారి సన్నిధిలో పనిచేస్తున్న కొంత మంది అధిక ధనం సంపాదించాలన్న ఆశతో అక్రమాలకు ఒడిగట్టి.. స్వామివారికి చెడుపదార్థాలు కలిపిన ప్రసాదాన్ని నివేదించడం మహాపాపమని తెలిపారు. అలాంటి వారు అసలు తప్పే జరగలేదని మాట్లాడటం శోచనీయమన్నారు. తన తప్పు తెలుసుకున్న ఓ అధికారి.. పోలీసులకు ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చి.. అక్రమంగా తాను పొందిన నగదును తిరిగి పోలీసులకు అప్పగించారన్నారు. అయితే, ప్రసాదాన్ని కల్తీ చేయడంలో కీలకంగా వ్యవహరించిన కొందరిలో మాత్రం చిత్తశుద్ధి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవారి సన్నిధిలో ఏ తప్పు చేసినా శిక్షలు పడవనే రీతిలో మాట్లాడటం చాలా బాధాకరమన్నారు. ‘‘టీటీడీలో రోజూ 13 వేల నుంచి 18 వేల కిలోల నెయ్యి కొనుగోలు చేస్తుంటారు. తిరుమలకు వచ్చే భక్తులు స్వామి ప్రసాదాన్ని అపురూపంగా భావిస్తారు. దేశంలో ఎక్కడ స్వామి గురించి మాట్లాడినా ప్రసాదం గురించి చెబుతారు. టీటీడీకి అందిన నెయ్యి నాణ్యత లేదని తెలిసినప్పుడు ఆపేయాల్సిన వ్యక్తులు ఆపని చేయలేదు.


ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీకి నెయ్యి కొనుగోళ్లలో నాణ్యత పరిశీలించాల్సిన బాధ్యత ఉంది. నెయ్యి నాణ్యత పరిశీలించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ల్యాబులకు పంపుతారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు గంభీరమైన వార్తను మనముందు పెట్టారు. స్వామివారికి సరఫరా చేసే నెయ్యి కలుషితం అయిందని.. జంతువుల కొవ్వు కూడా కలిపినట్లు తెలుస్తోందని ప్రకటించారు. మన దైవానికి అలాంటి ప్రసాదం ఇచ్చారా.. ఇది క్షమించరాని తప్పిదమని అనుకున్నాం. ప్రభుత్వం వెంటనే డీఐజీ స్థాయి అధికారితో విచారణ చేపడితే.. తప్పు చేసిన వారు సుప్రీం కోర్టుకు వెళ్లి బొంకారు. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్‌ ఇచ్చిన నివేదికలో వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఇవాళ ఉన్న చైర్మన్‌, ధర్మకర్తల మండలి, తిరుమలలో పని చేసే అందరూ భవిష్యత్తులో ఇలాంటి అపచారం జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలి.’’ అని ఎల్వీ సూచించారు.

Updated Date - Feb 07 , 2026 | 06:46 AM