మాపై చేసిన ఆరోపణలపై కోర్టును ఆశ్రయిస్తాం: వైవీ సుబ్బారెడ్డి
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:11 PM
టీటీడీ దేవస్థానానికి సంబంధించి కల్తీ నెయ్యి అంశంపై సుప్రీం కోర్టు నియమించిన సిట్.. నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్‌షీట్ సమర్పించిందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఫైనల్ చార్జ్ షీట్‌లో నెయ్యిలో కల్తీ జరిగిందని, కానీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పిందని ప్రస్తావించారు..
ఢిల్లీ, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): టీటీడీ దేవస్థానానికి సంబంధించి కల్తీ నెయ్యి అంశంపై సుప్రీంకోర్టు నియమించిన సిట్.. నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ సమర్పించిందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) తెలిపారు. ఫైనల్ చార్జ్‌షీట్‌లో నెయ్యిలో కల్తీ జరిగిందని, కానీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పిందని ప్రస్తావించారు. వైసీపీ హయాంలో స్వామివారికి సమర్పించే ప్రసాదంలో కూడా నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడారని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారని గుర్తుచేశారు.
భక్తులు ఆందోళనకు లోనయ్యారు..
ప్రపంచ వ్యాప్తంగా ఉండే శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వచ్చిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. దేశంలో ఎంతోమంది భక్తులు ఆందోళనకు లోనయ్యారని చెప్పుకొచ్చారు. స్వామి వారి ప్రసాదంలో జంతువు కొవ్వు కలిపారని వస్తున్న వార్తలపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయించానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే సిట్ విచారణపై తమకు నమ్మకం లేదని.. సుప్రీం కోర్టులో స్వతంత్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరిపించాలని పిటిషన్ వేశానని ప్రస్తావించారు.
లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సిట్ చెప్పింది..
‘విచారణ రిపోర్టు రాకుండానే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు మాట్లాడటం సరికాదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. తిరుపతి లడ్డూ విషయం ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించింది. 2024 జూలైలో సప్లై చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అనే విషయం నిర్ధారణ చేయాలని సిట్ వేశారు. ఆ నెయ్యిని స్వామివారి ప్రసాదంలో వాడారో లేదో తేల్చాలని సిట్ వేశారు. నెయ్యిలో కల్తీ జరిగింది, కానీ జంతువు కొవ్వు కలవలేదని స్పష్టంగా సిట్ చెప్పింది. వైసీపీ హయాంలో జూలైలో నాలుగు ట్యాంకర్లు వస్తే వాటిలో కూడా జంతువుల కొవ్వు కలవలేదని తేల్చి చెప్పారు. ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని సైతం వేరే రూపంలో టీటీడీకి సప్లై చేసి లడ్డూ తయారీలో వాడారు. నాపై, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు. మాపై చేసిన ఆరోపణలపై కోర్టును ఆశ్రయిస్తాం’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏసీబీ మెరుపు సోదాలు.. వాటిపై అధికారుల ఫోకస్..
పర్యాటక రంగాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తాం: హోంమంత్రి అనిత
Read Latest AP News And Telugu News