ఆనందాల పొదరిల్లు
ABN , Publish Date - May 15 , 2026 | 10:36 AM
ఒకప్పుడు అందరూ ఒకే ఇంట్లో బతికేవారు. కష్టమో నష్టమో కలిసి పంచుకునేవారు. ఎవరైనా తప్పు చేస్తే పెద్దలు మందలించేవారు. కుటుంబ సభ్యుల మధ్య సర్దుబాటు చేసేవారు. ఇ
నేడు ప్రపంచ కుటుంబ దినోత్సవం
ఒకప్పుడు అందరూ ఒకే ఇంట్లో బతికేవారు. కష్టమో నష్టమో కలిసి పంచుకునేవారు. ఎవరైనా తప్పు చేస్తే పెద్దలు మందలించేవారు. కుటుంబ సభ్యుల మధ్య సర్దుబాటు చేసేవారు. ఇల్లు ఇరుకైనా అరమరికలు లేకుండా సంతోషంగా సర్దుకునేవారు.కాలక్రమేపీ పరిస్థితులు మారిపోయాయి. ఆధునికత, పట్టణీకరణ, స్వతంత్ర మనస్తత్వాలు, ఉపాధి రీత్యా వేరే ప్రాంతాలకు వెళ్లడంలాంటి పరిస్థితులు ఉమ్మడి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ కలిసి బతుకుతున్న కొన్ని కుటుంబాలివి.
సమైక్యతకు ‘వంద’నాలు
కేవీబీపురం మండలం ఆరె గ్రామంలో మూర్తి సుబ్బయ్య కుటుంబంలో ఇప్పటికీ అందరిదీ ఒకేమాట.. ఒకే బాట.సుబ్బయ్య ఎంపీటీసీ కాగా భార్య మునెమ్మ జడ్పీటీసీ ఈ మధ్యనే సుబ్బయ్య మరణించారు.ఈయనకు నలుగురు అన్నదమ్ములు. వీరి కుమారులు, కుమార్తెలు, మనవళ్లు మొత్తం 76మంది కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆత్మీయతానురాగాల లోగిలిలో ఆనందం పంచుకుంటున్నారు.వీరిలో కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు. మరికకొందరు కూలి పనులు, వ్యవసాయం చేస్తున్నారు. ఆర్థిక తారతమ్యాలు తమను విడదీయవని నిరూపిస్తున్నారు. తమ మధ్య ఎలాంటి పొరపొచ్చాలు తలెత్తవని ఈకుటుంబ సభ్యులు సగర్వంగా చెబుతున్నారు. సుమారు వందమంది ఉండే ఆ ఇంట్లో సుమారు 40 నుంచి 50ఓట్లున్నాయట.
కేవీబీపురం(చిత్తూరు), ఆంధ్రజ్యోతి
పండగొస్తే ఆ ఇంట సందడే
ఓబులవారిపల్లె మండలం గాదెలవెంకటరాంపురానికి చెందిన పల్లా సుబ్బరాయుడు, వెంకటయ్య, చెంగల్రాయుడు అన్నదమ్ములు. 1990లో సుబ్బరాయుడు కుటుంబం రైల్వే కోడూరుకు చేరుకుంది. ఇతడికి నలుగురు కుమారులు. పెద్దకుమారుడు వెంకటసుబ్బయ్య, సతీమణి హైమావతి మాటకే ఇంట్లో అందరూ కట్టుబడి ఉంటారు. అన్నదమ్ములు వ్యాపారాలు చేస్తున్నారు. పండుగ వస్తే ఆ ఇంట్లో సందడే సందడి. రోజూ కూడా అంతా కలిసే భోజనం చేయాలని నియమం పెట్టుకున్నారు. సొంతూరు గాదెల వెంకట్రాంపురానికి వీరంతా కలిసే వెళ్లి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
రైల్వేకోడూరు, ఆంధ్రజ్యోతి
ఆరు తరాల ఆదర్శం
చిత్తూరు నగరం అరగొండ రహదారిలోని సంతపేటలో చల్లూరు కుటుంబ ఒకే ఇంట్లో ఉంటూ సమైక్య జీవన సౌందర్యాన్ని చాటుతోంది.తొలితరం నాటి కన్నయ్య శెట్టి మాటంటే కుటుంబానికే కాదు గ్రామస్తులకూ వేదవాక్కు. కన్నికాపరమేశ్వరి ఆలయం, కల్యాణమండపాలకు వంశపారంపర్య ధర్మకర్తగా కొనసాగారు. తిరుమలలోని చిత్తూరు సత్రానికీ ఆయనే ఫౌండర్, ట్రస్టు ప్రెసిడెంట్. ఆయన కుమారుడు శ్రీరాములు తండ్రి బాటలోనే గ్రామ బాగోగులు చూసేవారు. కన్నయ్య శెట్టి తమ్ముడి కుమారుడు రఘుపతి శెట్టి 1945-50 మధ్య మునిసిపల్ చైర్మన్‌గా పనిచేశారు.మూడో తరంలో కన్నయ్యశెట్టి కూడా గ్రామాభివృద్ధికి కృషిచేశారు.నాలుగో తరంగా ఉన్న ఆయన కుమారులు బద్రీనాథ్, అమర్‌నాథ్, ద్వారకనాథ్‌లు తాత, ముత్తాతల సేవా వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. నాటి ఇంటి మధ్యలో రెండు గోడలు లేపినా... ఇప్పటికీ ద్వారబంధం ఒక్కటే. ప్రస్తుతం ఐదు, ఆరవ తరాలవారు కూడా ఆ ఇంట్లోనే కలసి మెలసి ఉంటున్నారు. పనిమనుషులు లేకుండా కుటుంబ సభ్యులే అన్ని పనులూ చేసుకుంటారు. మధ్యాహ్నం, రాత్రి వేళల్లో దాదాపు పాతికమంది సహపంక్తి భోజనం చేస్తారు.
చిత్తూరు కలెక్టరేట్ , ఆంధ్రజ్యోతి
అనురాగాల లోగిలి
డక్కిలి మండలం డి.వడ్డిపల్లెలో వేపమాను కుటుంబం కలిసికట్టుగా కొనసాగుతూ ముచ్చట గొలుపుతోంది. కుటుంబ పెద్ద వేపమాను చెంచమ్మ ఆ ఊరి సర్పంచ్‌గా పనిచేశారు. ప్రధాని మోదీ నుంచి పురస్కారం కూడా అందుకున్న ఆమె ఇటీవలే మృతి చెందారు. భర్త నర్సింహులు అంతకుముందే కన్నుమూశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వారి పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఏ విషయమైనా కలిసి మాట్లాడుకుంటాం. అందరం సంతోషంగా ఉన్నామని కుటుంబ సభ్యులు యువరాజ్, రాములు చెబుతున్నారు.
డక్కిలి, ఆంధ్రజ్యోతి
బోయపాటి బ్రదర్స్
మదనపల్లె పట్టణం కమ్మవీధికి చెందిన బోయపాటి చలపతి కుటుంబంలో 16 మంది ఒకే ఇంట్లో కలిసి జీవిస్తున్నారు. కష్టమొచ్చినా ..సుఖమొచ్చినా కలిసే పంచుకుంటున్నారు. ఆయనకు ముగ్గురు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు. చలపతి బ్యాంకు ఉద్యోగిగా రిటైరయ్యారు. ఆయన సతీమణి ఉమాదేవి హెడ్‌మాస్టర్‌గా రిటైరయ్యారు. తమ్ముళ్లు బి.రాజా, నవీన్‌బాబు బి.కృష్ణమూర్తి ఉమ్మడిగా వ్యవసాయం చేస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంతానంలో ఇద్దరు లండన్‌లో, ఇద్దరు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరు వైద్యవృత్తిలో స్థిరపడ్డారు. పిల్లలు విదేశాల్లో స్థిరపడినా బోయపాటి బ్రదర్స్ మాత్రం ఊర్లో ఒకే ఇంటిలో కలిసిమెలసి వుంటున్నారు. ఉగాది పండుగకు ఇంటిల్లిపాదీ బిడ్డలు, మనుమళ్లు, మనుమరాళ్లతో సందడి చేస్తారు.
మదనపల్లె టౌన్,ఆంధ్రజ్యోతి
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News