దొంగల బీభత్సం.. నాలుగు ఇళ్లలో భారీ చోరీ.. 120 తులాల బంగారం అపహరణ!
ABN , Publish Date - May 15 , 2026 | 08:37 AM
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల పరిధిలోని చీలపల్లి గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. వివరాల్లోకి వెళితే..
పెద్దశంకరంపేట, మే 15: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల పరిధిలోని చీలపల్లి గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రాత్రి వరుసగా నాలుగు ఇళ్లలో చోరీలకు పాల్పడి భారీగా నగదు, నగలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన రాయిని రాములు కుటుంబ సభ్యులు ఒక వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వేరే ఊరికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు, వారి ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న సుమారు 120 తులాలకు పైగా బంగారు ఆభరణాలతో పాటు, ఒక కిలో వెండిని అపహరించుకుపోయారు. ఉదయం ఇంటి పనిమనిషి వచ్చి చూడగా.. తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి యజమానులకు, పోలీసులకు సమాచారం అందించడంతో ఈ భారీ దోపిడీ వెలుగుచూసింది.
దొంగలు కేవలం రాములు ఇంటితో పాటూ గ్రామంలోని మరో మూడు ఇళ్లలో కూడా చోరీలకు పాల్పడ్డారు. మాణిక్యరెడ్డి అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి రెండు తులాల బంగారాన్ని అపహరించారు. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు.. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. గ్రామంలో ఒకేసారి నాలుగు ఇళ్లలో చోరీ జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News