డ్రగ్స్ రాకెట్ కేసులో ఉగాండాకు చెందిన లేడీడాన్ అరెస్టు
ABN , Publish Date - Jul 30 , 2026 | 09:35 AM
చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఉగాండాకు చెందిన మహిళా డాన్‌ను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
చిత్తూరు, జులై 30 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఉగాండాకు చెందిన మహిళా డాన్‌ను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను కోర్టు ఆదేశాల మేరకు నెల్లూరు జైలుకు తరలించారు. పది రోజుల క్రితం చిత్తూరు నగర శివారులోని వరిగపల్లె వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.4 లక్షల విలువైన 70 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అరెస్టయిన నిందితులను విచారించారు. ఈ డ్రగ్స్ సరఫరా వెనుక ఉగాండాకు చెందిన మహిళ ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు ఆమె కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, లేడీ డాన్ బురఖా ధరించి, తరచూ వేషాలు మార్చుకుంటూ పోలీసులకు చిక్కకుండా డ్రగ్స్ విక్రయాలు నిర్వహించినట్లు అనుమానిస్తున్నారు. ఆమెపై గతంలో కూడా డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2021లో బెంగళూరు పోలీసులు ఆమెను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
2024లో ఆమె వీసా గడువు ముగిసినప్పటికీ, తనపై ఉన్న కేసు పెండింగ్‌లో ఉండటంతో బెంగళూరులోనే ఉంటూ కార్యకలాపాలు కొనసాగించినట్లు పోలీసులు చెబుతున్నారు. బెంగళూరు, చెన్నై కేంద్రాలుగా పెద్ద స్థాయిలో డ్రగ్స్ నెట్‌వర్క్ నిర్వహించినట్లు అనుమానిస్తున్నారు.
మెక్సికో నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు డ్రగ్స్ తరలిస్తూ భారీగా వ్యాపారం చేస్తున్న ముఠాతో లేడీ డాన్‌కు సంబంధాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో సాగుతున్న ఈ డ్రగ్స్ రాకెట్‌లో మరికొందరి ప్రమేయం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం చిత్తూరు పోలీసులు ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ సరఫరా మార్గాలు, ముఠాలోని ఇతర సభ్యులు, ఆర్థిక లావాదేవీలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.
వార్తలు కూడా చదవండి...
చంద్రబాబు దూరదృష్టితో కుప్పంకు ఇజ్రాయిల్ టెక్నాలజీ: నారా భువనేశ్వరి
జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘం: పవన్ కల్యాణ్
ఏపీ మద్యం స్కాం.. కారుమూరికి సుప్రీంకోర్టులో షాక్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News