50 నుంచి 66కు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Sep 16 , 2026 | 01:48 PM
తిరుపతి నగరపాలక సంస్థలో డివిజన్ల పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లను 66కు పెంచుతూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
తిరుపతి నగరపాలక సంస్థ డివిజన్ల పునర్విభజనకు ప్రభుత్వ ఆమోదం
స్థానిక సంస్థల ఎన్నికలకు వేగంగా కసరత్తు
తిరుపతి సిటీ: తిరుపతి నగరపాలక సంస్థలో డివిజన్ల పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లను 66కు పెంచుతూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నగరపాలక సంస్థపరిధిలో రాజకీయ కసరత్తు మరింత వేగం పుంజుకోనుంది. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నగరపాలక సంస్థ అధికారులు ఏప్రిల్ చివరి వారంలో 50 డివిజన్లను 66గా పునర్విభజించే ప్రక్రియను చేపట్టారు. డివిజన్ల సరిహద్దులు, జనాభా తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రతిపాదనలు రూపొందించి.. ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు.
మరోవారం అవకాశమిచ్చిన ప్రభుత్వం
ఆ తర్వాత కూడా ప్రజల నుంచి అభ్యంతరాలు, అభిప్రాయాల స్వీకరణకు ప్రభుత్వం మరో వారం రోజులపాటు గడువు ఇచ్చింది. దీంతో నగరపాలక సంస్థలో పునర్విభజన ప్రక్రియ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో టౌన్ ప్లానింగ్ విభాగం చేపట్టిన కసరత్తుపై పలు విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన అదనపు గడువులో వచ్చిన అభ్యంతరాలను కూడా అధికారులు స్వీకరించి పరిశీలించారు. అవసరమైన చోట స్వల్ప మార్పులు, చేర్పులు చేసి తుది ప్రతిపాదనలను సిద్ధం చేశారు. అనంతరం 66 డివిజన్లతో కూడిన తుది జాబితాను ప్రభుత్వానికి పంపించారు. తాజాగా ప్రభుత్వం దీనికి ఆమోదం తెలపడంతో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ పూర్తయింది.
ఇక ఎన్నికల కసరత్తే
66 డివిజన్లకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో తిరుపతి నగర రాజకీయాల్లో ఎన్నికల వేడి మరింత పెరిగే అవకాశం ఉంది. పెరిగిన డివిజన్లలో రిజర్వేషన్లు, అభ్యర్థుల ఎంపిక, ఆయా పార్టీల బలాబలాలపై రాజకీయ వర్గాల్లో అప్పుడే చర్చ మొదలైంది. దీంతో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టే పరిస్థితి నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి:
దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. దసరా ఉత్సవాల్లో ఉచిత దర్శనం!
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతకు ప్రత్యేక చర్యలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News