యాడైతేనేం.. దుడ్లొస్తే చాలు!
ABN , Publish Date - Sep 16 , 2026 | 01:16 PM
అనంతపురం జిల్లా కేంద్రంలోని పశువుల సంతలో ప్రైవేట్ వ్యక్తులు హల్‌చల్ చేస్తున్నారు.
పశువుల సంతలో ప్రైవేట్ వ్యక్తులు
అనధికారికంగా విధుల నిర్వహణ
అనంతపురం: అనంతపురం జిల్లా కేంద్రంలోని పశువుల సంతలో ప్రైవేట్ వ్యక్తులు హల్‌చల్ చేస్తున్నారు. యార్డు ఉద్యోగులతో కలిసి సంతలో అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నారు. అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో శని, ఆదివారాల్లో గొర్రెలు, మేకలు, గేదెలు, ఎద్దుల సంత జరుగుతుంది. ఈనేపథ్యంలో యార్డులోని ప్రధాన గేటుతోపాటు, మరో గేట్ వద్ద యార్డు ఉద్యోగులు, సిబ్బంది సంతకు వచ్చి పశువులు కొనుగోలు చేసి తీసుకెళ్లే వారితో మార్కెట్ ఫీజు వసూలు చేస్తారు.
పలువురు ఉద్యోగులు, సిబ్బంది ప్రధాన గేటు వద్ద పశువులు కొనుగోలు చేసి తీసుకెళ్లుతున్న వ్యాపారులను మార్కెట్ ఫీజు చెల్లింపులు చేస్తున్నారా..లేదా అని పరిశీలించి రసీదు చూపించిన వారి బయటకు పంపుతారు. రసీదు లేని వారిని గేట్ వద్ద ఆపి, ఫీజు వసూలు చేస్తారు. ఈ వ్యవహారంలోకి ఇటీవల ప్రైవేట్ వ్యక్తులు చేరారు. వాస్తవానికి ప్రైవేట్ వ్యక్తులు యార్డులోకి ప్రవేశించడానికి వీలులేదని అధికారులు చెబుతున్నారు. కానీ వారంతా యార్డు పాలకవర్గంలోని ప్రధాన సభ్యులకు సంబంధించిన వ్యక్తులు కావడంతో ఉద్యోగులు, సిబ్బంది నోరు మొదపడం లేదు.
యార్డులో ఉద్యోగులు, సిబ్బంది కంటే వీరి హవానే ఎక్కువగా సాగుతున్నట్లు సమాచారం. ప్రైవేట్ వ్యక్తులు సంతలో ఉద్యోగులు, సిబ్బందితో కలిసి పనిచేయడం పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాగా యార్డులోకి మున్సిపాల్టీ వ్యక్తులు యథేచ్ఛగా చొరపడటం పరిపాటిగా మారింది. యార్డులోకి వచ్చివెళ్లే వాహనాల నుంచి దర్జాగా రుసుం వసూలు చేస్తున్నారు. వీరు యార్డు బయట వాహనాలతో రుసుం వసూలు చేయాల్సి ఉంది. యార్డు అధికారులు పట్టించుకోకపోవడంతో నేరుగా సంత ప్రాంగణంలోకి వచ్చి ఉద్యోగులు, సిబ్బంది ఎదుటనే వాహనాల రుసుం వసూలు చేస్తున్నారు.
ప్రైవేట్ వ్యక్తులకు వీలు లేదు
పశువుల సంతతోపాటు యార్డులో ఎక్కడా ప్రైవేట్ వ్యక్తులు విధులు నిర్వహించేందుకు వీలులేదు. ఇటీవల ఈ విషయం నా దృష్టికి వచ్చింది. ఈక్రమంలో వారిని సంతలోకి రావొద్దని చెప్పాం. మున్సిపాల్టీ వ్యక్తులు యార్డులోకి వచ్చి వాహనాల నుంచి రుసుం వసూలు చేయడానికి అనుమతులు లేవు. వీరిపై చర్యలు తీసుకుంటాం.
గోవిందు, ఎంపికశ్రేణి కార్యదర్శి, అనంతపురం వ్యవసాయ మార్కెట్
ఈ వార్తలు కూడా చదవండి:
దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. దసరా ఉత్సవాల్లో ఉచిత దర్శనం!
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతకు ప్రత్యేక చర్యలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News