పెళ్లికి ముందే ఉద్యోగం తీసేశారు.. ఒరాకిల్ ఉద్యోగుల ఆవేదన
ABN , Publish Date - Sep 16 , 2026 | 12:51 PM
ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు.. ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఒరాకిల్ చేపట్టిన తొలగింపు ప్రక్రియ వేలాది ఉద్యోగుల జీవితాల్లో దుఃఖాన్ని నింపింది.
ఇంటర్నెట్ డెస్క్: తాజాగా టెక్ దిగ్గజం ఒరాకిల్ చేపట్టిన లేఆఫ్స్‌తో ఉద్యోగుల జీవితాల్లో చీకటి కమ్మేసింది. ‘ఇదే మీ లాస్ట్ వర్కింగ్ డే’ అంటూ పొద్దు పొద్దున్నే వచ్చిన మెయిల్ వారికి ఎనలేని దుఃఖాన్ని మిగిల్చింది. కృత్రిమ మేధ(ఏఐ)పై మరిన్ని పెట్టుబడులు పెట్టాలనే లక్ష్యంతో ఉన్న ఒరాకిల్.. ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులపై వేటు వేసింది.
ఒక్కరోజులో అంతా మారిపోయింది
సోమవారం (సెప్టెంబర్ 14) పొద్దున్న చాలా మంది ఉద్యోగులకు ఒరాకిల్ ఓ మెయిల్ పంపించింది. అందులో రెండంటే రెండే వాక్యాలున్నాయి. ‘సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా మీ ఉద్యోగాలు తొలగించాం. కంపెనీలో ఇదే మీకు చివరి రోజు’ ఈ లైన్లు చదవగానే ఉద్యోగులు ఆందోళన చెందారు. మెయిల్ కంటే ముందే తమకు సిస్టమ్ లాగిన్ యాక్సెస్ పోయిందని కొందరు చెబుతున్నారు. ఉద్యోగాలు పోగొట్టుకున్న వారు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన పంచుకుంటున్నారు.
హృదయ విదారక గాథలు
ఒరాకిల్ ఉద్యోగుల తొలగింపు అనంతరం ఎన్నో కన్నీటి గాథలు బయటకు వస్తున్నాయి. 11 రోజుల్లో పెళ్లి చేసుకుని నూతన జీవితంలోకి అడుగుపెట్టాల్సిన ఓ వ్యక్తి తన ఉద్యోగాన్ని కోల్పోయారు. గత నాలుగు సంవత్సరాలుగా కంపెనీ కోసం శ్రమించానని, సరిగ్గా పెళ్లికి ముందు ఉద్యోగాన్ని తొలగించారని వాపోయారు. మరో వ్యక్తి మాట్లాడుతూ..12 ఏళ్లు సంస్థ కోసం పనిచేశానని, ఇప్పుడు ఆలోచించకుండా తనను తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పండగలు, వారాంతాలు అని తేడా లేకుండా నిత్యం కష్టపడినందుకు తనకు బహుమతి లభించిందని కంటతడి పెట్టుకున్నారు. కనీసం ఒక్క మాట చెప్పకుండా రాత్రికి రాత్రే తొలగించారని చెప్పారు.
ఒరాకిల్ సంస్థ ఇటీవలి కాలంలో ఏఐ రంగంలో భారీ పెట్టుబడుల పెడుతోంది. ఫలితంగా పెరిగిన ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులపై వేటు వేస్తోంది. ఆ సంస్థ గత ఆర్థిక సంవత్సరం 21,000 ఉద్యోగాలను తొలగించింది. ఇప్పుడు మళ్లీ ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను చేపట్టింది.
ఈ వార్తలు కూడా చదవండి:
ఆగని కారు.. వాహనం వెంట ఓనర్ పరుగులు
వినాయక చవితి సంబరాల్లో అదరగొట్టిన అంబానీ కోడలు.. ‘ఏకదంతాయ’ పాటకు డ్యాన్స్