ఏసీల తయారీ కేంద్రంగా శ్రీసిటీ.. నేడు లోకేశ్ శంకుస్థాపన
ABN , Publish Date - May 06 , 2026 | 07:24 AM
దక్షిణ భారతదేశంలో ఎయిర్ కండిషన్ల తయారీ కేంద్రంగా శ్రీసిటీ రూపుదిద్దుకుంది.
సత్యవేడు(తిరుపతి): దక్షిణ భారతదేశంలో ఎయిర్ కండిషన్ల తయారీ కేంద్రంగా శ్రీసిటీ రూపుదిద్దుకుంది. ప్రస్తుతం డైకిన్, ఎల్‌జీ, హ్యావెల్స్, బ్లూస్టార్, అంబర్ ఎంటర్ ప్రైజెస్, హైసెన్స్, థెర్మాక్స్, వంటి ప్రముఖ సంస్థలతో పాటు నైడెక్, పానాసోనిక్, లైఫ్ సెల్యూషన్, అథెలా ఎలకా్ట్రనిక్స్, ఈప్యాక్ సహా మొత్తం 32 విడి భాగాల సరఫరా కంపెనీలు ఇక్కడ ఏర్పాటు కావడంతో దేశంలోనే అతిపెద్ద ఏసీల తయారీ హబ్‌గా శ్రీసిటీ మారబోతోంది.శ్రీసిటీలోని హెచ్‌వీఏసీ అండ్ ఆర్ (హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్) వాతావరణంతో పాటు మౌలిక సదుపాయాలు, పోర్ట్ ఆధారిత లాజిస్టిక్స్ సేవల కారణంగా ప్రముఖ ఏసీ పరిశ్రమలు శ్రీసిటీలో తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. ప్రస్తుతం దేశంలో తయారయ్యే ఎయిర్ కండిషన్లలో దాదాపు 40 శాతం శ్రీసిటీలోనే తయారవుతుండడం విశేషం. ఎల్జీ, డైకిన్ కంపెనీల విస్తరణతో పాటు క్యారియర్ పరిశ్రమ ఏర్పాటుతో 2028 నాటికి ఈ వాటా 70 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా.
రూ. 1000 కోట్ల పెట్టుబడితో క్యారియర్
ఏసీ తయారీ రంగంలో పేరొందిన ‘క్యారియర్ గ్లోబల్’ రూ.1000 కోట్ల పెట్టుబడితో శ్రీసిటీలో అత్యాధునిక తయారీ యూనిట్‌ను స్థాపించనుంది.సాధారణంగా ఇళ్ళలో, కార్యాలయాల్లో ఉపయోగించే ఒక టన్ను,రెండు టన్నుల సామర్థఽ్యం కలిగిన ఏసీలే కాకు ండా డేటా సెంటర్లు,భారీ పారిశ్రామిక సముదాయాలకు వినియోగించే 1000 టన్నుల నుంచి 5000 టన్నుల సామర్థ్యం కలిగిన బారీ కూలింగ్ సిస్టమ్స్ తయారుచేయనుంది. శ్రీసిటీ పరిధిలోని ఆరూరు వద్ద ఈ పరిశ్రమకు 40 ఎకరాల స్థలం కేటాయించారు.ప్రత్యక్షంగా వెయ్యి మందికి, రెండు వేలమందికి పరోక్షంగా ఉపాధి లభించే ఈ బృహత్తర ప్రాజెక్టుకు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి లోకేశ్ బుధవారం ఉదయం శంకుస్థాపన చేయనున్నారు.
నేడు లోకేశ్ శంకుస్థాపన
శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమ శంకుస్థాపనకు మంత్రి లోకేశ్ హాజరు కానున్నారు. ఉండవల్లి నుంచి ఉదయం 9.45 గంటలకు హెలికాప్టర్ ద్వారా శ్రీసిటీ జీరో పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 10.10గంటలకు క్యారియర్ శంకుస్థాపన వేదిక వద్దకు చేరుకుంటారు. శంకుస్థాపన అనంతరం 11.40 గంటలకు శ్రీసిటీ హెలిప్యాడ్ నుంచి ఉండవల్లికి తిరుగు పయనమవుతారు.
ఈ వార్తలు కూడా చదవండి:
విజయ్ డ్రైవర్ కుమారుడు ఇప్పుడు ఎమ్మెల్యే
మూడు పార్టీలు.. ముగ్గురు ఎమ్మెల్యేలు!
Read Latest Telangana News and National News