Share News

మీరేమైనా దేశానికి ప్రధాన పూజారా?

ABN , Publish Date - May 06 , 2026 | 07:07 AM

‘మీరెందుకు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు? మీరేమైనా మన దేశానికి ప్రధాన పూజారా?’ అంటూ పిటిషన్‌దారును సీజేఐ సూర్యకాంత్‌ ప్రశ్నించారు. శబరిమల...

మీరేమైనా దేశానికి ప్రధాన పూజారా?

వార్తాపత్రికల్లో వచ్చే వ్యాసాల ఆధారంగా పిల్‌ వేస్తారా?

  • శబరిమల కేసులో పిటిషనర్‌ను ప్రశ్నించిన సీజేఐ

  • పిల్‌లు పబ్లిసిటీ, ప్రైవేటు, పైసా, పొలిటికల్‌ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్లుగా మారాయి: జస్టిస్‌ నాగరత్న

శబరిమల కేసులో పిటిషనర్‌ను ప్రశ్నించిన సీజేఐ

న్యూఢిల్లీ, మే 5: ‘మీరెందుకు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు? మీరేమైనా మన దేశానికి ప్రధాన పూజారా?’ అంటూ పిటిషన్‌దారును సీజేఐ సూర్యకాంత్‌ ప్రశ్నించారు. శబరిమల ఆలయంతోపాటు, దేశంలోని మతపరమైన స్థలాల్లో మహిళల ప్రవేశంపై ఆంక్షలకు సంబంధించి దాఖలైన పిటిషన్ల మీద సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం విచారణ కొనసాగించింది. పిటిషనర్లలో ఒకరైన ‘ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌’ తరఫున న్యాయవాది రవిప్రకాశ్‌గుప్తా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా, ధర్మాసనంలో ఉన్న జస్టిస్‌ నాగరత్న స్పందిస్తూ.. ‘అయ్యప్పస్వామిలో విశ్వాసం ఉన్న వాళ్లు సంబంధిత సంప్రదాయాల్ని పాటిస్తారు. కానీ, విశ్వాసం లేని వాళ్లను అనుమతించాలని మీరు చెబుతున్నారు. దానిని కోర్టు ప్రోత్సహించదు. మీరు నిజమైన భక్తులు కాదు. మీ సంస్థకు మరే పని లేదా? ఇది వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన విషయం. మీ వంటి ఒక న్యాయపరమైన సంస్థకు (మతపరమైన) విశ్వాసాలుంటాయా’ అని ప్రశ్నించారు. ఈ సమయంలో సీజేఐ సూర్యకాంత్‌ స్పందిస్తూ.. పిల్‌ ఎందుకు దాఖలు చేశారు? మీరేమైనా మన దేశానికి ప్రధాన పూజారా? అని ప్రశ్నించారు. దీనికి న్యాయవాది సమాధానమిస్తూ.. 2006లో వార్తాపత్రికల్లో ప్రచురించిన కొన్ని వార్తల ఆధారంగా అదే ఏడాది ఆలయంలోని అందరినీ అనుమతించాలంటూ పిల్‌ దాఖలైందని గుర్తు చేశారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. ‘వార్తాపత్రికల్లో వచ్చే వార్తల ఆధారంగా పిల్‌ దాఖలు చేస్తారా? పిల్‌ వేయటం కోసం పత్రికల్లో వార్తలు రాయించటం సులువైన పని’ అని వ్యాఖ్యానించారు. జస్టిస్‌ నాగరత్న స్పందిస్తూ.. ‘ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇప్పుడు ప్రైవేట్‌ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌, పబ్లిసిటీ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌, పైసా ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌, పొలిటికల్‌ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌లలాగా మారిపోయింది. కానీ, నిజమైన పిల్‌లను మాత్రమే మేం అనుమతిస్తాం. అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

గల్ఫ్‌లో తెలుగు యువతి ఆత్మహత్య.. కుటుంబపోషణ కోసం వెళ్లి..

రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేలు.. తిరుచిరాపల్లిని వదులుకోనున్న విజయ్

Updated Date - May 06 , 2026 | 07:07 AM