Share News

రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేలు.. తిరుచిరాపల్లిని వదులుకోనున్న విజయ్

ABN , Publish Date - May 05 , 2026 | 09:19 PM

పార్టీ నుంచి గెలిచిన 108 మంది ఎమ్మెల్యేలను మామల్లాపురం (మహాబలిపురం)లోని ఒక రిసార్ట్‌కు టీవీకే మంగళవారంనాడు తరలించింది. దీంతో రిజార్ట్ వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేలు.. తిరుచిరాపల్లిని వదులుకోనున్న విజయ్
Vijay with TVK MLAs

చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలుచుకుని ఏకైక పెద్ద పార్టీగా నిలిచిన టీవీకే.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇందుకు 118 సీట్లు అవసరం కావడంతో మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు కలిసొచ్చే పార్టీలతో సంప్రదింపులు సాగిస్తోంది. ఇదే సమయంలో పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను మామల్లాపురం (మహాబలిపురం)లోని ఒక రిసార్ట్‌కు మంగళవారంనాడు తరలించింది. దీంతో రిజార్ట్ వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.


6న గవర్నర్‌తో సమావేశం.. 7న ప్రమాణ స్వీకారం

కాగా, ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరేందుకు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్‌ను విజయ్ బుధవారంనాడు కలుసుకోనున్నారు. ఈ మేరకు గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరినట్టు టీవీకే వర్గాలు తెలిపాయి. 7వ తేదీన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేయన్నారని, చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణస్వీకర కార్యక్రమం ఉంటుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకునేందుకు రెండు వారాలు గడువివ్వాలని కోరుతూ ఇప్పటికే గవర్నర్‌కు విజయ్ లేఖ రాశారు.


మరోవైపు టీవీకే లెజిస్లేచర్ పార్టీ నేతగా విజయ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చే పార్టీల నేతలతో టీవీకే టీమ్ సంప్రదింపులు మొదలుపెట్టినట్టు చెబుతున్నారు. విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉందని, వామపక్ష పార్టీలు సైతం టీవీకే నేతలతో సంప్రదింపులు సాగించనున్నాయని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-5, వీసీకే-2, సీపీఐ-2, సీపీఎం-2 సీట్లు గెలుచుకున్నాయి. ఐయూఎంఎల్, డీఎండీకే, పీఎంకే పార్టీలను నుంచి కూడా టీవీకేకు మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.


తిరుచిరాపల్లిని వదులుకునే అవకాశం

కాగా, చెన్నైలోని పెరంబూరు, తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన విజయ్ ఆ రెండుచోట్లా నెగ్గారు. ఎన్నికల కమిషన్ నియామావళి ప్రకారం రెండు చోట్లా గెలిస్తే ఒక సీటును వదులుకోవాల్సి ఉంటుంది. ఖాళీ అయిన నియోజకవర్గంలో ఆరు నెలల లోపు ఉప ఎన్నిక నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో తిరుచిరాపల్లి ఈస్ట్ సీటును విజయ్ వదులుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.


ఇవి కూడా చదవండి..

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం 7న

రాజీనామా చేయనంటే.. డిస్మిస్సే

Updated Date - May 05 , 2026 | 09:25 PM