తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం 7న
ABN , Publish Date - May 05 , 2026 | 06:12 PM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా నిలిచిన తమిళగ వెట్రి కళగం పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తోంది. పార్టీ అధినేత విజయ్ శాసనసభాపక్ష నేతగా ఎన్నిక కావడంతో ఈనెల 7న కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా నిలిచిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తోంది. పార్టీ అధినేత విజయ్ శాసనసభాపక్ష నేతగా ఎన్నిక కావడంతో ఈనెల 7న కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణస్వీకర కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అనూహ్యంగా 108 స్థానాల్లో విజయం సాధించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లను దక్కించుకోలేకపోయింది. మెజారిటీకి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. టీవీకే సారథ్యంలోని ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉందని వినిపిస్తోంది. వామపక్ష పార్టీలు సైతం టీవీకే నేతలతో సంప్రదింపులు సాగించనున్నట్టు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-5, వీసీకే-2, సీపీఐ-2, సీపీఎం-2 సీట్లు గెలుచుకున్నాయి. ఐయూఎంఎల్, డీఎండీకే, పీఎంకే పార్టీలను నుంచి కూడా టీవీకేకు మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
గవర్నర్‌కు లేఖ
కాగా, ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్‌కు విజయ్ మంగళవారంనాడు లేఖ రాసినట్టు తెలుస్తోంది. మెజారిటీ నిరూపించుకునేందుకు రెండు వారాలు గడువివ్వాలని ఆ లేఖలో కోరినట్టు సమాచారం. మరోవైపు, ఓటమి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దానిని గవర్నర్ వెంటనే ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని స్టాలిన్‌ను గవర్నర్ కోరారు.
ఇవి కూడా చదవండి..
తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ రాజీనామా.. గవర్నర్ ఆమోదం
కేంద్ర ఎన్నికల సంఘమే ప్రధాన విలన్.. మమతా బెనర్జీ