Share News

కేంద్ర ఎన్నికల సంఘమే ప్రధాన విలన్.. మమతా బెనర్జీ

ABN , Publish Date - May 05 , 2026 | 04:42 PM

పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ కుట్రలతోనే గెలిచిందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. బీజేపీకి ఈసీ ఏజెంట్‌గా మారిందని ఆక్షేపణ తెలిపారు. ఈ ఎన్నికలో ప్రధాన విలన్ ఎన్నికల సంఘమేనని తీవ్ర విమర్శలు గుప్పించారు.

కేంద్ర ఎన్నికల సంఘమే ప్రధాన విలన్.. మమతా బెనర్జీ
Mamamta Banerjee

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ కుట్రలతోనే గెలిచిందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. బీజేపీకి ఈసీ ఏజెంట్‌గా మారిందని ఆక్షేపణ తెలిపారు. ఈ ఎన్నికలో ప్రధాన విలన్ ఎన్నికల సంఘమేనని విమర్శలు గుప్పించారు. 100పైగా సీట్లు లూటీ చేశారని, తాను ఎన్నికల్లో ఓడిపోలేదని చెప్పారు. అందువల్ల తాను రాజీనామా చేసే ప్రసక్తి కూడా లేదన్నారు. రాజ్‌భవన్‌కు వెళ్లనని, రాజీనామా చేయమని తనను ఎవరూ ఒత్తిడి చేయలేరని స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి మీడియా సమావేశంలో మంగళవారంనాడు మమతాబెనర్జీ మాట్లాడారు.


'ఈ ఎన్నికల్లో విలన్‌గా ప్రధాన ఎన్నికల కమిషనర్ వ్యవహరించారు. బెంగాల్‌లో ఈవీఎంలను లూటీ చేశారు' అని మమత ఆరోపించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు పోలింగ్ ముగిసిన తర్వాత కూడా 80 నుంచి 90 శాతం కంటే ఎక్కువ బ్యాటరీని కలిగి ఉండటం ఏమిటి? అని ప్రశ్నించారు. పోలింగ్‌కు రెండ్రోజుల ముందే అధికారులు తమ పార్టీపై దాడులు, కార్యకర్తల అరెస్టులు చేశారని అన్నారు.


భవనీపూర్‌లో ఉద్దేశపూర్వకంగానే ఒక ప్లాన్ ప్రకారం తనను ఓడించారని, ఎన్నికల కమిషన్‌‌ను దుర్వినియోగపరిచి బీజేపీ విజయం సాధించిందని, తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి ఎన్నికలు చూడలేదని అన్నారు. కౌంటింగ్ సెంటర్లలో టీఎంసీ కార్యకర్తలను కొట్టారని, తనను 'సీఆర్‌పీఎఫ్ గూండాలు' పొత్తికడుపులో తన్ని కౌంటింగ్ సెంటర్ నుంచి గెంటేశారని తీవ్రారోపణలు చేశారు. ఎస్ఐఆర్ నుంచి 90 లక్షల ఓట్లను తొలగించారనీ, కోర్టుకు వెళ్లడంతో 32 లక్షల ఓట్లు చేర్చారని, టీఎంసీని ఓడించేందుకు అన్నిరకాలుగా ఎత్తుగడలు పన్ని 100 సీట్ల వరకూ బీజేపీ లూటీ చేసిందని విమర్శించారు.


'ఇండి' కూటమిలోనే..

ఈ మొత్తం ఉదంతంలో 'ఇండి' కూటమి తన వైపే ఉందని తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తనతో మాట్లాడారని, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, హేమంత్ సోరెన్ తదితరులు ఫోను చేసి సపోర్ట్‌గా నిలిచారని చెప్పారు. 'ఇండి' కూటమిలోనే తాను కొనసాగుతానని కూడా స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

దేశవ్యాప్తంగా పెను సంక్షోభం పొంచి ఉంది.. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది: కేజ్రీవాల్

టీవీకే లెజిస్లేచర్ పార్టీ నేతగా విజయ్ ఎన్నిక

Updated Date - May 05 , 2026 | 05:15 PM