Share News

రాష్ట్రపతి వద్దకు ‘ఆప్‌’ పంచాయితీ

ABN , Publish Date - May 06 , 2026 | 06:48 AM

ఆమ్‌ ఆద్మీ పార్టీలోని అసమ్మతి పంచాయితీ చివరకు రాష్ట్రపతిభవన్‌కు చేరింది. ఆప్‌ను వీడి తన ఆరుగురు సహచరులతో కలిసి బీజేపీలో విలీనమైన రాజ్యసభ సభ్యుడు...

రాష్ట్రపతి వద్దకు ‘ఆప్‌’ పంచాయితీ

‘ఆప్‌’ తమను వేధిస్తోందని చద్దా ఫిర్యాదు

న్యూఢిల్లీ, మే 5: ఆమ్‌ ఆద్మీ పార్టీలోని అసమ్మతి పంచాయితీ చివరకు రాష్ట్రపతిభవన్‌కు చేరింది. ఆప్‌ను వీడి తన ఆరుగురు సహచరులతో కలిసి బీజేపీలో విలీనమైన రాజ్యసభ సభ్యుడు రాఘవ్‌ చద్దా; వీరికి వ్యతిరేకంగా పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ఒకేరోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి పరస్పరం ఫిర్యాదులు చేశారు. పార్టీని వీడిన ఎంపీలపై ఆప్‌ నాయకత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని చద్దా ఆరోపించారు. ఆప్‌ను వీడిన నేతల్లో ఒకరైన సందీప్‌ పాఠక్‌పై పంజాబ్‌ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, ఆయన కోసం గాలింపు చేపట్టడాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్టు మీడియాకు ఆయన తెలిపారు. ‘ఇది అత్యంత ప్రమాదకర ప్రతీకార చర్య’ అంటూ చద్దా దుయ్యబట్టారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం అధికార యంత్రాంగాన్ని వినియోగించడం గర్హనీయమన్నారు. సందీప్‌ పాఠక్‌పై అవినీతి ఆరోపణలు మోపి అరెస్టు చేయడానికి ప్రయత్నించడంతోపాటు ఎంపీ, మాజీ క్రికెటర్‌ హర్బజన్‌ సింగ్‌పై దాడి జరిగిందని, మరో ఎంపీ రాజీందర్‌ గుప్తా వ్యాపారాలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చద్దా ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, ఇటీవల బీజేపీలో విలీనమైన ‘ఆప్‌’ ఎంపీల రాజ్యసభ సభ్యత్వాలను రద్దుచేయాలని రాష్ట్రపతిని పంజాబ్‌ సీఎం మాన్‌ అభ్యర్థించారు. విధి నిర్వహణలో విఫలమైన ప్రజాప్రతినిధులను తొలగించే రీకాల్‌ హక్కును ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిందని ఆయన తెలిపారు. ఆప్‌కు రాజ్యసభలో 10మంది సభ్యులు ఉండగా, వారిలో ఏడుగురు గత నెల 24వ తేదీన ఆ పార్టీని వీడారు. వారిలో స్వాతి మాలీవాల్‌ను తప్పించి, తక్కిన ఆరుగురూ పంజాబ్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

Updated Date - May 06 , 2026 | 06:48 AM