సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంపు
ABN , Publish Date - May 06 , 2026 | 07:01 AM
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38కి పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మంగళవారం ఇక్కడ ప్రధాని మోదీ అధ్యక్షతన...
34 నుంచి 38కి పెంచే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
జడ్జీల పెంపుపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు
గుంతకల్-వాడి 3, 4 రైల్వే లైన్లు సహా రూ.23,437 కోట్లతో..
3 మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు పచ్చజెండా.. 2031 నాటికి పూర్తి
రూ.5659 కోట్లతో పత్తి ఉత్పాదకత మిషన్ అమలుకు సమ్మతి
చెరకు రైతులకు కనీస ధరను క్వింటాకు 365కు పెంచే ప్రతిపాదనకు ఓకే
ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు
క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
న్యూఢిల్లీ, మే 5 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38కి పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మంగళవారం ఇక్కడ ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి.. సుప్రీం జడ్జీల సంఖ్య పెంపుతోపాటు, మూడు రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం, పత్తి ఉత్పాదక మిషన్ అమలుకు అంగీకారం సహా పలు కీలక ప్రతిపాదనలకు అంగీకారం తెలిపింది. ఆ వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య సీజేఐతో కలిపి 34. ఆ సంఖ్యను 38కి పెంచడానికి వీలుగా వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెడతామని ఆయన వెల్లడించారు. అలాగే.. రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో గుంతకల్-వాడి మధ్య 3, 4 లైన్లతో సహా మూడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ మూడు ప్రాజెక్టులకూ కలిపి రూ.23,437 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటిలో.. గుంతకల్-వాడి మధ్య 230 కిలోమీటర్ల మేర చేపట్టే 3, 4 లైన్ల నిర్మాణానికి రూ.4,758 కోట్లు వ్యయం కానుంది. ఈ ప్రాజెక్టును.. చేపట్టిన నాలుగేళ్లలో పూర్తి చేయనున్నారు. ఈ లైన్ల వల ్లఏపీలోని అనంతపూర్, కర్నూలు, తెలంగాణలోని నారాయణ్‌పేట్, కర్ణాటకలోని రాయచూర్, యాద్‌గిర్, కలబురిగి లబ్ధి పొందనున్నాయి.
వీటి నిర్మాణంలో భాగంగా రెండు మెగా బ్రిడ్జిలు, 35 మేజర్ బ్రిడ్జిలు, 382 చిన్న బ్రిడ్జిలను నిర్మిస్తారు. మిగతా రెండు ప్రాజెక్టులలో ఒకటి.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీలను కలిపే నాగ్దా-మధుర 3,4 లైన్ల నిర్మాణం కాగా, రెండోది.. యూపీలో బుధ్వాల్- సీతాపూర్ 3, 4 లైన్ల నిర్మాణం. ఈ మూడు ప్రాజెక్టులూ 2030-31 నాటికి పూర్తవుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని 19 జిల్లాల మీదుగా నిర్మితం కానున్న ఈ ప్రాజెక్టులు పూర్తయితే, భారతీయ రైల్వే నెట్‌వర్క్ సుమారు 901 కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. అలాగే.. అక్టోబరు నుంచి ప్రారంభమయ్యే 2026-27 సీజన్‌కుగాను.. చక్కెర మిల్లులు చెరకు సాగుదారులకు చెల్లించాల్సిన కనీస ధరను క్వింటాలుకు రూ.355 నుంచి రూ.365కు (రూ.10 మేర) పెంచే ‘న్యాయమైన, లాభదాయకమైన ధర (ఎఫ్‌ఆర్‌పీ)’ ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా కోటి మంది చెరుకురైతులకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు.
పత్తి ఉత్పత్తి పెంచడానికి..
ఐదేళ్లపాటు (2026-27 నుంచి 2030-31 దాకా) రూ.5,659.22 కోట్లతో పత్తి ఉత్పాదకత మిషన్‌ను అమలు చేయడానికి కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. మోదీ సర్కారు తలపెట్టిన 5ఎఫ్ ఫార్ములా (ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ప్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారిన్)కు అనుగుణంగా ఈ కార్యక్రమం అమలవుతుంది. చీడపీడలను, తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే పత్తి విత్తనాల రూపకల్పనపై ప్రధానంగా దృష్టి సారించే మిషన్ ఇది. 2031 నాటికి దేశంలో పత్తి ఉత్పాదకదతను హెక్టారుకు 440 కిలోల నుంచి 755 కిలోలకు పెంచడం.. తద్వారా సుమారు 32 లక్షల మంది రైతులు స్వావలంబన సాధించేలా చేయడం దీని లక్ష్యాలు. ఇక.. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, విమానయాన సంస్థలకు ఊరటనిచ్చేందుకు రూ.18,100 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన ‘అత్యవసర రుణ భరోసా పథకం 5.0’కి మంత్రి మండలి అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా ఎంఎ్‌సఎంఈలకు 100 శాతం, విమానయాన సంస్థలకు 90శాతం రుణ హామీ కవరేజీని అందిస్తారు. ఇక.. ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎ్‌సఎం)’ కింద.. రూ.3,936 కోట్లతో దేశంలో (గుజరాత్‌లో) కొత్తగా రెండు సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. వీటిలో ఒకటి దేశంలోనే మొట్టమొదటి గ్యాన్ (గ్యాలియం నైట్రైడ్) ఆధారిత కమర్షియల్ మినీ/మైక్రో-ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఫెసిలిటీ కాగా, మరొకటి సెమీకండక్టర్ పార్కింగ్ ఫెసిలిటీ. వీటిలో మిని/మైక్రో ఎల్‌ఈడీ డిస్‌ప్లే మాడ్యూళ్ల తయారీ యూనిట్‌ను దక్షిణ కొరియాకు చెందిన క్రిస్టల్ మ్యాట్రిక్స్ సంస్థ గుజరాత్‌లోని ధొలేరాలో ఏర్పాటు చేయనుంది. ఇక, సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ‘సుచి సెమీకాన్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ గుజరాత్‌లోని సూరత్‌లో పెట్టనుంది.
ఇవి కూడా చదవండి
రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేలు.. తిరుచిరాపల్లిని వదులుకోనున్న విజయ్