Share News

తిరుమల ఘాట్‌లో ‘న్యూటన్‌’ బస్సు పనితీరు పరిశీలన

ABN , Publish Date - Mar 26 , 2026 | 12:26 PM

తిరుమల కొండను కాలుష్య రహితంగా మార్చేందుకు తిరుపతి నుంచి డీజిల్‌ బస్సుల స్థానంలో పూర్తిగా ఎలక్ర్టిక్‌ బస్సులను నడిపేలా ప్లాన్‌ చేస్తున్నారు.

తిరుమల ఘాట్‌లో ‘న్యూటన్‌’ బస్సు పనితీరు పరిశీలన

తిరుమల: తిరుమల కొండను కాలుష్య రహితంగా మార్చేందుకు తిరుపతి నుంచి డీజిల్‌ బస్సుల స్థానంలో పూర్తిగా ఎలక్ర్టిక్‌ బస్సులను నడిపేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే 64 బస్సులను కనుమదారుల్లో నడుపుతున్నారు. తిరుమలలోనూ భక్తులకు ఉచిత రవాణా కోసం మరో 12 ఎలక్ర్టిక్‌ బస్సులు(ధర్మరథాలు) అందుబాటులో ఉన్నాయి. 34 ఈవీ కార్లను అధికారులు వినియోగిస్తున్నారు. తిరుమల-తిరుపతి మధ్య పూర్తిగా ఎలక్ట్రిక్‌ బస్సులనే నడపాలనే సీఎం చంద్రబాబు(CM Chandrababu) లక్ష్యం మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జిల్లాకు 350 బస్సులను విడతల వారీగా ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాయి. తొలి విడతలో 50 బస్సులను మంగళం డిపోకు కేటాయించారు.


ఈ క్రమంలో తిరుమలకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని అనేక ఆటోమొబైల్‌ సంస్థలు తమ ఈవీ బస్సులను తిరుమల-తిరుపతి మధ్య నడిపేందుకు పోటీ పడుతున్నాయి. టెండర్ల నిబంధనల మేరకు ఇటీవల కొన్ని సంస్థలు ముందుకు రాగా వాటి టెస్ట్‌ రైడ్‌లు మొదలయ్యాయి. తాజాగా, ‘న్యూటన్‌’ ఆటో సంస్థకు చెందిన ఈవీ బస్సుల పనితీరును ఆర్టీసీ అధికారులు పరిశీలిస్తున్నారు. డీపీటీవో జగదీష్‌ ఆధ్వర్యంలో డిప్యూటీ చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌ బాలాజీ బృందం న్యూటన్‌ బస్సు టెస్ట్‌రైడ్‌ చేస్తున్నారు. ఇప్పటికే తిరుపతి-కాణిపాకం మధ్య టెస్టులను పూర్తిచేసిన వీరి బృందం రెండు రోజుల నుంచి తిరుమల-తిరుపతి ఘాట్‌రోడ్లలో బస్సును తిప్పుతూ పరిశీలన చేస్తున్నారు.


ఫ్రంట్‌డోర్‌తో పాటు మిడిల్‌ డోర్‌ సదుపాయం కలిగిన ఈ బస్సు తొలిమూడురోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మలుపుల్లో సైతం సులువుగా ప్రయాణించడాన్ని గుర్తించారు. లోడ్‌, స్పీడ్‌, రేంజ్‌ వంటి వాటిని నమోదు చేసి త్వరలోనే వీరి బృందం నివేదిక సమర్పించనుంది. అలాగే మరికొన్ని సంస్థల ఈవీ బస్సులను కూడా పరిశీలన చేసి ఇచ్చే నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. దీంతో రానున్న రోజుల్లో తిరుమల-తిరుపతి మధ్య పూర్తిస్థాయిలో ఎలక్ర్టిక్‌ బస్సులే నడవనున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

ఏపీలో ఇంటర్ సెకండియర్ సిలబస్ లీక్.. రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు

ఏప్రిల్‌ 1 నుంచి చికెన్‌ షాపులు బంద్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 26 , 2026 | 12:39 PM