హరీశ్ రావు ఎప్పటికీ సీఎం కాలేరు: ప్రభుత్వ విప్ వేముల వీరేశం
ABN , Publish Date - Mar 26 , 2026 | 11:34 AM
మాజీ మంత్రి హరీశ్ రావు ఎప్పటికీ సీఎం కాలేరని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. పార్టీకి అధ్యక్షుడయ్యే స్థాయి లేని హరీశ్... ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్, మార్చి 26: మాజీ మంత్రి హరీశ్ రావుపై(Harish Rao) ప్రభుత్వ విప్ వేముల వీరేశం(Vemula Veeresham) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. హరీశ్ రావు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరన్నారు. హరీశ్ రావుకు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడై చూపించాలని సవాల్ విసిరారు. పార్టీకి అధ్యక్షుడయ్యే స్థాయి లేని హరీశ్... ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హరీశ్ చిట్‌చాట్ పేరుతో చీటింగ్ మాటలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. గడీలు బద్దలు కొడతామని చెప్పి మరీ చేసి చూపించామన్నారు.
ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గుండు సున్నా చేస్తామని రేవంత్ చెప్పారని.. చేసి చూపించారని వేముల వీరేశం తెలిపారు. అసెంబ్లీ నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు బీఆర్ఎస్ ఖేల్ ఖతం చేసిన దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి అని అన్నారు. ‘ఈ దేశం మా రేవంత్ వైపు చూస్తోంది’ అని తెలిపారు. హరీశ్ రావు అక్కసు తగ్గించుకోవాలని వేముల వీరేశం హితవు పలికారు.
డీలిమిటేషన్‌పై సీఎం రేవంత్ స్పష్టమైన అవగాహనతో ఉన్నారని ప్రభుత్వ విప్ వెల్లడించారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే తెలంగాణకు అన్యాయం తప్పదన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనతో సీఎం రేవంత్ జాగ్రత్త పడ్డారని తెలిపారు. దీనిపై తెలంగాణ బీజేపీ నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాలు పెరిగితే కాంగ్రెస్ పార్టీకే లాభమన్నారు. ఏ మండలాలు ఏ నియోజకవర్గాల్లో కలిసినా తమకు వచ్చే నష్టమేమీ లేదన్నారు. రేవంత్ ఫొటో పెట్టుకుని ఎన్నికలకు వెళ్తామని.. నియోజకవర్గాలు పెరిగినా అధికారం తమదే అని ప్రభుత్వ విప్ వేముల వీరేశం ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
కుప్పంలో మూడో రోజుకు నారా భువనేశ్వరి పర్యటన
మార్కాపురం బస్సు ప్రమాదంపై కేంద్ర మంత్రుల స్పందన
Read Latest Telangana News And Telugu News