భద్రాద్రిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు.. నేడు సీతారాముల 'ఎదుర్కోలు' ఉత్సవం!
ABN , Publish Date - Mar 26 , 2026 | 08:46 AM
దక్షిణ అయోధ్యగా పిలుచే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీ రామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి26: దక్షిణ అయోధ్యగా పిలుచే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీ రామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయం లోపల, బయట విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తుల జయజయధ్వానాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య క్షేత్రమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నవమి ఉత్సవాలు భాగంగా గురువారం ఆలయ పండితులు ‘ఎదుర్కోలు ఉత్సవం’ నిర్వహించనున్నారు.
శ్రీ సీతారాముల కల్యాణ బ్రహ్మోత్సవాలలో ‘ఎదుర్కొలు ఉత్సవం’ అత్యంత కీలకమైన ఘట్టం. పెళ్లికి ముందు సీతారాములను ఎదురెదురుగా ఉంచి, ఇరు పక్షాల వారు పసుపు, కుంకుమలు, తాంబూలాలు మార్చుకుంటూ, భక్తిశ్రద్ధలతో భజనలు చేస్తారు. కల్యాణ వేదికైన మిథిలా ప్రాంగణాన్ని సీతమ్మ పుట్టినిల్లయిన మిథిలా నగరంగా భావిస్తారు. పక్కనున్న వైకుంఠ క్షేత్రం రామయ్య వెలసిన స్టేడియంగా అభివర్ణిస్తారు. అర్చకులు భగవంతుని వంశ క్రమాన్ని, గోత్ర నామాలను చదువుతూ, పెళ్లికి ముందు వధూవరుల పక్షాన వాదోపవాదాలు చేసుకునే ఈ ‘ఎదుర్కోలు’ ఘట్టం అత్యంత ఆసక్తికరంగా సాగనుంది. ఎదుర్కోలు ఉత్సవానికి ముందు స్వామివారు గజ, గరుడ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. నేడు సాయంత్రం జరగబోయే సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం తిలకించేందుకు భక్తులు తరలివస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సీఎం రేవంత్ కేరళ పర్యటన రద్దు
ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
Read Latest Telangana News and National News