CM Chandrababu: సంక్రాంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు.. ప్రజలతో మమేకమై..
ABN , Publish Date - Jan 13 , 2026 | 01:42 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత గ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. మంగళవారం ప్రజలతో కలిసి అత్యంత సాదాసీదాగా గడిపారు..
తిరుపతి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సొంత గ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో కలిసి సరదాగా గడిపారు. తన నివాసం ముందున్న మైదానంలో చుట్టుపక్కల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన గ్రామీణ క్రీడా పోటీలను సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు స్వయంగా వీక్షించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేసి, పిల్లలతో ఫొటోలు దిగి వారిలో ఉత్సాహం నింపారు. ఈ వేడుకల్లో నారా, నందమూరి కుటుంబాలకు చెందిన చిన్నారులు కూడా పాల్గొనడం విశేషం. సొంతూరులో పండుగ జరుపుకొంటూనే.. అటు కుటుంబ సభ్యులు, ఇటు సామాన్య ప్రజలతో సమయాన్ని గడుపుతూ.. సీఎం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజకీయ హడావుడికి దూరంగా, గ్రామీణ వాతావరణంలో జరిగిన ఈ వేడుకలు స్థానికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
క్రీడల్లో విద్యార్థుల ఉత్సాహం..
నారావారిపల్లెకు చుట్టు పక్కల ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు ఈ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒక్కో స్కూల్‌కు చెందిన పిల్లలతో సీఎం చంద్రబాబు దంపతులు వేర్వేరుగా గ్రూప్ ఫొటోలు దిగారు. ఈ క్రీడల్లో నారా, నందమూరి కుటుంబ చిన్నారులు పాల్గొనడం విశేషం. వీరిలో గెలుపొందిన వారికి ఇతర పిల్లలతో సమానంగా బహుమతులు అందజేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో నారా దేవాన్ష్ పలు పోటీల్లో పాల్గొని ఆకట్టుకున్నారు.
పరదాల సంస్కృతికి భిన్నంగా..
పరదాల సంస్కృతికి పూర్తిగా భిన్నంగా, సొంతూరు నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. క్రీడా పోటీల అనంతరం ఇంటికి వెళ్లే మార్గమంతా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
అర్జీల స్వీకరణ..
ముఖ్యమంత్రి స్వయంగా తమ అర్జీలు స్వీకరించడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. చుట్టు పక్కల జిల్లాల నుంచి ప్రత్యేకంగా తరలివచ్చిన ప్రజలు కూడా చంద్రబాబుకు అర్జీలు అందజేశారు. సమస్యలు విన్న సీఎం చంద్రబాబు అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది.
ప్రజాపాలనకు నిదర్శనంగా కార్యక్రమం..
గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం, చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ, ప్రజల అర్జీలను స్వయంగా స్వీకరించడం వంటి చర్యలు చంద్రబాబు ప్రజాపాలనకు నిదర్శనంగా నిలిచాయి. నారావారిపల్లెలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానికంగా విశేష ఆదరణ లభించింది.
అధికారులకు ఆదేశాలు..
ప్రజల నుంచి తీసుకున్న వినతి పత్రాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. కొన్ని సమస్యలపై అక్కడికక్కడే అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి నేరుగా వినడంపై సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అనంతపురంలో భారీ అగ్నిప్రమాదం.. ఏం జరిగిందంటే...
రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా సమగ్ర సమీక్ష.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News