Share News

Fire Accident: అనంతపురంలో భారీ అగ్నిప్రమాదం.. ఏం జరిగిందంటే...

ABN , Publish Date - Jan 13 , 2026 | 09:44 AM

అనంతపురం నగరంలో మంగళవారం తెల్లవారుజామున ఒక ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో, ఒక ప్రముఖ వైన్ షాపులో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా పెను కలకలం రేపింది..

Fire Accident: అనంతపురంలో భారీ అగ్నిప్రమాదం.. ఏం జరిగిందంటే...
Anantapur Fire Accident

అనంతపురం, జనవరి13 (ఆంధ్రజ్యోతి): అనంతపురం నగరంలో మంగళవారం తెల్లవారుజామున ఒక ఘోర అగ్నిప్రమాదం (Anantapur Fire Accident) సంభవించింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలోని ఓ ప్రముఖ వైన్ షాపులో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా పెను కలకలం రేపింది. లక్షలాది రూపాయల ఆస్తి నష్టం సంభవించడమే కాకుండా.. ఈ ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందనే ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.


ఏం జరిగిందంటే..?

అనంతపురం నగరంలోని డీమార్ట్ (D-Mart) కు ఎదురుగా ఉన్న నంబూరి వైన్ షాప్‌ (Namburi Wine Shop)లో ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున సుమారు 4:00 గంటల సమయంలో షాపు లోపలి నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగ రావడం మొదలైంది. ఆ సమయంలో విధుల్లో ఉన్న వాచ్‌మెన్ అప్రమత్తమై.. వెంటనే షాపు యజమాని నంబూరు వెంకటరమణకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన యజమాని.. అగ్నిమాపక శాఖకు, స్థానిక పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

తప్పిన పెను ప్రమాదం..

అగ్నిమాపక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. షాపు చుట్టుపక్కల ఇతర వాణిజ్య సముదాయాలు, నివాస ప్రాంతాలు ఉండడంతో మంటలు వ్యాపించకుండా అరికట్టడం పెద్ద సవాలుగా మారింది. సుమారు గంటన్నర పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. సకాలంలో ఫైర్ సిబ్బంది రాకపోతే నష్టం మరింత ఎక్కువగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు.


ఆస్తి నష్టం అంచనా..

పోలీసుల ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. షాపులోని సుమారు రూ. 4 లక్షల విలువైన వివిధ రకాల మద్యం బాటిళ్లు మంటల్లో కాలిపోయాయి. మద్యాన్ని నిల్వ చేసే భారీ ఫ్రిడ్జ్‌లు (Refrigerators) పూర్తిగా దెబ్బతిన్నాయి. షాపు ముందు నిలిపి ఉంచిన ఒక ఆటో ముందు భాగం కూడా మంటల ధాటికి పాక్షికంగా దగ్ధమైంది.

యజమాని ఆరోపణలు..

ఈ ఘటనపై షాపు యజమాని నంబూరు వెంకటరమణ సంచలన ఆరోపణలు చేశారు. ఇది కేవలం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదం కాదని, ఎవరో కావాలనే తన షాపునకు నిప్పు పెట్టారని ఆరోపించారు. తనపై కక్ష గట్టిన వ్యక్తులు పథకం ప్రకారం ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా ఉన్న కొన్ని ఆరోపణలు, వివాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ పని చేసి ఉండొచ్చని నంబూరు వెంకటరమణ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


సీసీటీవీ ఫుటేజీ కీలకం..

ఘటనా స్థలానికి చేరుకున్న అనంతపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు, క్లూస్ టీమ్ షాపులో తనిఖీలు చేసి ఆధారాలు సేకరించారు. డీమార్ట్ పరిసరాలు, వైన్ షాపులోని సీసీటీవీ (CCTV) కెమెరాల ఫుటేజీని సేకరించారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉందా అనే సాంకేతిక అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో అనంతపురం నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అమరావతి కోసం రైతుల త్యాగం గొప్పది: సీఎం చంద్రబాబు

రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా సమగ్ర సమీక్ష.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 13 , 2026 | 10:41 AM