Share News

CM Chandrababu: అమరావతి కోసం రైతుల త్యాగం గొప్పది: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jan 12 , 2026 | 11:20 AM

అమరావతి అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేయడం గొప్ప విషయమని వ్యాఖ్యానించారు.

CM Chandrababu: అమరావతి కోసం రైతుల త్యాగం గొప్పది: సీఎం చంద్రబాబు
CM Nara Chandrababu Naidu

అమరావతి, జనవరి12 (ఆంధ్రజ్యోతి): అమరావతి అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేయడం గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. 33 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇవ్వడం ఎక్కడా లేదని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వ చొరవతో పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పుకొచ్చారు. సీఎం అధ్యక్షతన వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో సోమవారం సమీక్షా సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు, కార్యదర్శులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, శాఖాధిపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగిస్తున్నారు.


కాళేశ్వరానికి అడ్డుపడలేదు..

మూడువేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని ఈ సందర్భంగా వెల్లడించారు సీఎం. జూన్ నుంచి గ్రావిటీ ద్వారా కృష్ణాకు నీళ్లొస్తాయని వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం నిర్మించినా అడ్డుపడలేదని ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్ట్ 67 శాతం పూర్తయిందని తెలిపారు. పోలవరం ముగిస్తే.. మనమే ఇతర రాష్ట్రాలకు నీళ్లిచ్చే పరిస్థితి ఉంటుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఒకే రాష్ట్రానికి 25 శాతం పెట్టుబడులు రావడం ఒక చరిత్ర అని ఆయన అన్నారు. సీఐఐ సదస్సు పెట్టుబడులన్నీ కార్యరూపం దాలిస్తే సుమారు 16 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. అమరావతి ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చారు. ల్యాండ్‌ పూలింగ్‌ కోసం రైతులు ముందుకొచ్చి బాగా స్పందించారని పేర్కొన్నారు. తెలుగుజాతి ఒక్కటే.. అందరం కలిసి పనిచేసుకుందామని ముఖ్యమంత్రి సూచించారు.


పాలనను గాడిలో పెట్టాం..

‘విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టాం. 2025 ఏడాది మంచి ఫలితాలను ఇచ్చింది. ప్రజల ఆశలను నిలబెట్టాం. వారిలో మళ్లీ విశ్వాసాన్ని కల్పించాం. అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేని పరిస్థితి నుంచి సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమం, వేగవంతమైన అభివృద్ధి చేయగలిగాం. ఈ ఏడాది కూడా మరింత కష్టించి పనిచేద్దామని పిలుపునిస్తున్నాను. తల్లికి వందనం ద్వారా రూ.10,090 కోట్లను 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేశాం. స్త్రీ శక్తి ద్వారా 3.5 కోట్ల ప్రయాణాలను మహిళలు చేశారు. దీని కోసం ఇప్పటివరకూ రూ.1,114 కోట్లు ఖర్చు చేశాం. అన్నదాత సుఖీభవ ద్వారా సుమారు 46 లక్షల మంది రైతులకు రూ.6,310 కోట్లు జమ చేశాం. దీపం 2.0 ద్వారా 2 కోట్ల సిలిండర్లను ఇప్పటికే పంపిణీ చేయగలిగాం. దీనికి రూ.2,684 కోట్లు ఖర్చు చేశాం. ఏడాదిన్నరలో రూ.50 వేల కోట్ల మేర సామాజిక పెన్షన్లను అందించటంలో సంక్షేమంలో కొత్త మైలురాయిని సాధించాం. 70 వరకూ పెద్ద పథకాలు, ఎన్నో కార్యక్రమాలు అమలు చేశాం. అమరావతిని శ్మశానమని, ఎడారి అని జగన్ హయాంలో ఎగతాళి చేశారని... కానీ ఇదో స్ఫూర్తిదాయక ప్రాజెక్టు’ అని సీఎం పేర్కొన్నారు.


రైతులను భాగస్వాములను చేస్తున్నాం..

‘అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తున్నాం. పోలవరం అద్భుతమైన ప్రాజెక్ట్, ఇది పూర్తయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు. ప్రతి ఏడాది మూడు వేల టీఎంసీల మేర నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తోంది. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వటం ద్వారా శ్రీశైలంలోని నీటిని పొదుపు చేసి రాయలసీమకు ఇస్తున్నాం. నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం తదితర ప్రాంతాలకు నీరందించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఎవరికీ నష్టం లేదు. ఎగువ నుంచి వదిలిన నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్‌కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటి.?. పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణ రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రాజెక్టులు కట్టినప్పుడు నేనెప్పుడు అడ్డు చెప్పలేదు. రెండు తెలుగు రాష్ట్రాలూ గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేస్తాం’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.


భోగాపురాన్ని త్వరలోనే జాతికి అంకితం చేస్తాం..

‘భోగాపురం ఎయిర్‌పోర్టునూ త్వరలోనే జాతికి అంకితం చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం అందించిన రూ.12 వేల కోట్ల సాయంతో కాపాడుకున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్.. ఆ ప్లాంట్‌ను నిలబెట్టి తీరుతాం. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం పెట్టుబడులు మన రాష్ట్రానికే వచ్చాయి. పెట్టుబడులకు డెస్టినేషన్‌గా ఆంధ్రప్రదేశ్ మారింది. సీఐఐ ద్వారా చేసుకున్న ఒప్పందాలు అన్నీ సాకారమైతే సుమారు 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎస్ఐపీబీ ద్వారా రూ.8.74 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం కూడా ఇచ్చాం. వీటి ద్వారా పెద్దఎత్తున కొలువులు వస్తాయి. గూగుల్.. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు రావటంలో కృషిచేసిన అధికారులు, ప్రభుత్వ విభాగాలను అభినందిస్తున్నా. అమరావతిలో క్వాంటం వ్యాలీకి త్వరలో ఫౌండేషన్ వేస్తాం. 6 నెలల్లో క్వాంటం కంప్యూటర్ ఇక్కడి నుంచి పనిచేస్తుంది. విద్యుత్ కొనుగోలు ధరను గణనీయంగా తగ్గించగలిగాం. భవిష్యత్తులో రూ.1.19 మేర యూనిట్ కొనుగోలు ధర తగ్గించటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రిజర్వాయర్లలోనూ 970 టీఎంసీలను, రాయలసీమలోనూ పెద్ద ఎత్తున నీటిని నింపగలిగాం’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం..

రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా సమగ్ర సమీక్ష.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 12 , 2026 | 12:21 PM