Share News

అనగనగా ఓ దేవర దున్నపోతు.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Jun 18 , 2026 | 12:26 PM

అనగనగా ఓ దేవర దున్నపోతు. జాతరకు బలిచ్చేందుకు తీసుకొచ్చారు. ఇంతలో ఈ బలి కథ ఢిల్లీకి చేరింది.

అనగనగా ఓ దేవర దున్నపోతు.. ఏం జరిగిందంటే..
Buffalo, Puthalapattu, AP

  • జాతరకు బలిస్తున్నారంటూ ఢిల్లీకి ఫిర్యాదు

  • జాగారం చేసి బలిని అడ్డుకున్న అధికారులు

పూతలపట్టు(చిత్తూరు): అనగనగా ఓ దేవర దున్నపోతు. జాతరకు బలిచ్చేందుకు తీసుకొచ్చారు. ఇంతలో ఈ బలి కథ ఢిల్లీకి చేరింది. అక్కడ్నుంచి వచ్చిన ఆదేశాలతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది దళితవాడకు చేరుకున్నారు. రాత్రంతా జాగారం చేసి బలిని అడ్డుకోవడంతో.. ఆ కథ ముగిసింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తిమ్మిరెడ్డిపల్లె దళితవాడలో మంగళ, బుధవారాల్లో జాతరకు ఏర్పాట్లు చేశారు. నడివీధిలో అమ్మవారికి కుంభం పెట్టి దున్నపోతును బలివ్వాలని రూ.50 వేలు ఖర్చుపెట్టి దున్నపోతును కొని.. గ్రామానికి తీసుకొచ్చారు.


దీనిని గమనించిన కొందరు స్థానికులు పగలు కట్టేసి ఉన్న దున్నపోతు ఫొటోలు తీసి ఢిల్లీలోని కేంద్ర పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి పంపారు. తిమ్మిరెడ్డిపల్లెలో జాతర పేరిట మూగజీవాలను బలిస్తున్నారని, దానిని అడ్డుకోవాలని మెసేజ్‌ పెట్టారు. ఈ విషయాలేవీ తెలియని గ్రామస్తులు మంగళవారం అమ్మవార్ల ఆలయాల వద్ద పొంగళ్లు పెట్టారు. భక్తిశ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ జాతరకు వచ్చిన బంధువులు, చుట్టుపక్కల గ్రామాల వారితో సందడి నెలకొంది. ఈలోపు ఢిల్లీలోని పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు స్పందించారు.


buff1.2.jpgఈ బలిని అడ్డుకోవాలంటూ చిత్తూరు కలెక్టర్‌కు ఆదేశాలు పంపారు. ఆ వెంటనే మంగళవారం రాత్రి పూతలపట్టు తహసీల్దార్‌ ఉదయ సతీష్‏కు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఫోన్ చేశారు. తిమ్మిరెడ్డిపల్లెలో దున్నపోతు బలిని ఆపాలని ఆదేశాలు జారీచేశారు. అదే సమయంలో ఎస్పీ తుషార్‌ డూడీ కూడా పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో రెవెన్యూ సిబ్బంది, పోలీసులు కలిసి మంగళవారం రాత్రి 10.30 గంటలకు తిమ్మిరెడ్డిపల్లెకు చేరుకుని విచారించారు. దున్నపోతు బలి ఆపాలని స్థానికులకు సూచించారు.


40 సంవత్సరాల తర్వాత గ్రామం బాగుపడాలనే ఉద్దేశంతో తాము దున్నపోతును బలివ్వాలనుకున్నామని అధికారులకు గ్రామస్తులు చెప్పారు.ఏదిఏమైనా బలి ఇవ్వరాదని అధికారులు స్పష్టంచేశారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు దున్నపోతు బలి ఆపి కుంభం వేసి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. ఏ సమయంలోనైనా దున్నపోతును బలిస్తారనే భావనతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది మంగళవారం రాత్రి 10 నుంచి బుధవారం ఉదయం 7 గంటల వరకు దున్నపోతు వద్ద కాపలాగా ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

20న రెండు ఎంఎంటీఎస్‏లు రద్దు

ఇదేనా మీ సంస్కారం?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 18 , 2026 | 12:33 PM