Share News

డీఎంకేకు మరో షాక్.! టీవీకే వైపు ఎండీఎంకే.?

ABN , Publish Date - Jun 18 , 2026 | 11:57 AM

తమిళనాడులో డీఎంకే మిత్రపక్షమైన ఎండీఎంకే.. టీవీకేతో జట్టుకట్టనుందనే చర్చ జోరందుకుంది. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో సహా ఆయన తనయుడు దురై వైకో ఇటీవల సీఎం విజయ్‌తో వరుస సమావేశాలు నిర్వహించడమే ఈ సంకేతాలకు కారణంగా నిలుస్తోంది.

డీఎంకేకు మరో షాక్.! టీవీకే వైపు ఎండీఎంకే.?

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. డీఎంకేకు చిరకాల మిత్రపక్షమైన మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కళగం(ఎండీఎంకే) అధికార తమిళగ వెట్రి కళగం(టీవీకే)తో జట్టుకట్టనుందా? అనే చర్చ ఆ రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో.. సీఎం జోసెఫ్ విజయ్‌తో భేటీ కావడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. కాగా.. ఇటీవలే వైకో కుమారుడు, ఎండీఎంకే ఎంపీ దురై వైకో కూడా విజయ్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే.


కాగా.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో ఎండీఎంకే పోటీచేసి రెండు స్థానాలను కైవసం చేసుకుంది. ఆ పార్టీ సాధారణ మండలి సమావేశం ఈ నెలాఖరులో జరగనుంది. పార్టీ భవిష్యత్తు రాజకీయ దిశగా ఆ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అయితే.. టీవీకే నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వంపై జరిగిన విశ్వాస పరీక్షలో ఎండీఎంకే తటస్థంగా వ్యవహరించింది. డీఎంకేతో కలిసి పనిచేసిన పలువురు మాజీ మిత్రపక్షాలు ఇప్పటికే టీవీకే ప్రభుత్వానికి మద్దతిస్తున్నాయి. కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు అధికార వ్యవస్థలో భాగస్వాములయ్యాయి. మరోవైపు సీపీఐ, సీపీఎం పార్టీలు విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి బయట నుంచే మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండీఎంకే వైఖరి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.


అయితే.. ఈ ఊహాగానాలపై వైకో అప్రమత్తంగా వ్యవహస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ భవిష్యత్తు రాజకీయ నిర్ణయాలను సాధారణ మండలి ఆధ్వర్యంలోనే తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. సీఎం విజయ్‌తో సమావేశం పూర్తిగా ప్రజా సమస్యలపైనే జరిగిందని పేర్కొన్నారు. తూత్తుకుడిలో వేదాంత గ్రూప్‌నకు అనుబంధంగా మరో రాగి పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అలాంటి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని కోరానని వెల్లడించారు.


ఇవీ చదవండి:

కోయంబత్తూరులో విషాదం.. విద్యార్థిని ఆత్మహత్య!

ఐఏఎఫ్ అధికారి భార్య బలవంతపు మతమార్పిడి కేసు.. మరో నిందితుడి అరెస్ట

Updated Date - Jun 18 , 2026 | 12:12 PM