బీబీ ఒకసారి ఆలోచించండి.. మీకు కావాల్సినదే దక్కింది: ట్రంప్
ABN , Publish Date - Jun 18 , 2026 | 10:57 AM
ఇరాన్‌తో కుదిరిన శాంతి ఒప్పందం ఇజ్రాయెల్‌కు రక్షణ కల్పిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాజా ఒప్పందంతో.. ఇజ్రాయెల్‌కు ఇరాన్ నుంచి అణు దాడి ప్రమాదం తప్పిందన్న ట్రంప్.. ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహుతో జరిపిన సంభాషణను వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ఇజ్రాయెల్‌కు ఉన్న అతిపెద్ద భద్రతా ప్రమాదాన్ని(అణ్వాయుధ ముప్పు) తొలగిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ ఒప్పందంతో ఇజ్రాయెల్‌కు ఇరాన్ నుంచి అణు దాడి జరిగే ప్రమాదం తగ్గిపోయిందని చెప్పారు. ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో జరిగిన సంభాషణను అగ్రరాజ్య అధ్యక్షుడు వెల్లడించారు.
జీ7 సదస్సు కోసం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ట్రంప్ మాట్లాడుతూ.. 'బీబీ(నెతన్యాహూ).. ఒకసారి ఆలోచించండి. మీరు కోరుకున్న అత్యంత ముఖ్యమైన అంశమిదే. ఇక మీ దేశంపై అణు బాంబు ముప్పు ఉండదు. ఇరాన్ ఒకే ఒక్క అణు బాంబును ఇజ్రాయెల్ మధ్యలో ప్రయోగించినా దేశం తీవ్ర ప్రమాదంలో పడేది. ఇప్పుడు ఆ ప్రమాదం తొలగిపోయింది' అని వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంతో ఇజ్రాయెల్ సంతృప్తిగా ఉందని పేర్కొన్నారు. అగ్రరాజ్యం మద్దతు లేకుండా ఇజ్రాయెల్ భద్రత సాధ్యంకాదన్న ట్రంప్.. తాను అధ్యక్షుడిగా తీసుకున్న నిర్ణయాలు ఆ దేశానికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చాయని చెప్పుకొచ్చారు.
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం.. ఇరాన్ తన అధిక సాంద్రత కలిగిన యురేనియం నిల్వలను తగ్గించేందుకు అంగీకరించింది. అలాగే అమెరికా మద్దతుతో అమలులో ఉన్న కొన్ని ఆంక్షలను సడలించే అంశాలూ ఇందులో ఉన్నాయి. భవిష్యత్తులో ఇరాన్ అణు కార్యక్రమంపై తుది నిర్ణయం తీసుకునేందుకు 60 రోజుల చర్చల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సమాచారం. అయితే.. ఈ ఒప్పందంలో లెబనాన్ భౌగోళిక సమగ్రతకు సంబంధించిన అంశం మాత్రం చర్చనీయాంశమైంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు, హెజ్‌బొల్లాతో ఘర్షణల నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇజ్రాయెల్ మాత్రం తన భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకునే హక్కు తమకే ఉందని స్పష్టం చేస్తోంది.
మరోవైపు.. లెబనాన్ నుంచి తమ దళాలను ఉపసంహరించుకునేదే లేదని నెతన్యాహూ స్పష్టం చేశారు. తాను ప్రధానిగా ఉన్నంతవరకు ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండదని ఆయన ప్రకటించారు. దీంతో ఇజ్రాయెల్‌లో రాజకీయ చర్చలు ముదురుతున్నాయి. ఆ దేశ మాజీ ప్రధాని ఎహుద్ బరాక్.. నెతన్యాహూ తీరుపై మండిపడ్డారు. నెతన్యాహూ నిర్ణయాలు, ట్రంప్‌పై ప్రభావం చూపేందుకు చేసిన ప్రయత్నాల కారణంగానే ఇజ్రాయెల్ ఇప్పుడీ పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు.
ఇవీ చదవండి:
శాంతి ఒప్పందంపై సంతకం చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..
రష్యా విమానం గల్లంతు అంటూ వార్తలు.. కాసేపటికి సేఫ్ ల్యాండింగ్