Share News

శాంతి ఒప్పందంపై సంతకం చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..

ABN , Publish Date - Jun 18 , 2026 | 07:05 AM

శాంతి ఒప్పందంపై అమెరికా, ఇరాన్‌ దేశాలు సంతకాలు చేశాయి. బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ శాంతి ఒప్పందంపై డిజిటల్‌గా సంతకాలు చేశారు.

శాంతి ఒప్పందంపై సంతకం చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..
US-Iran Peace Deal

న్యూయార్క్, జూన్ 18: శాంతి ఒప్పందంపై అమెరికా, ఇరాన్‌ దేశాలు సంతకాలు చేశాయి. బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ శాంతి ఒప్పందంపై డిజిటల్‌గా సంతకాలు చేశారు. నిన్నటి నుంచే శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చింది. 3 నెలల పాటు సాగిన యుద్ధం ముగియటంతో పాటు.. అతి త్వరలో హోర్ముజ్ జలసంధి తెరుచుకోనుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీ7 సదస్సులో పాల్గొనడానికి ఫ్రాన్స్ వెళ్లారు. బుధవారం ఫ్రాన్స్‌లోని వర్సైల్లెస్‌ ప్యాలెస్ లోపల శాంతి ఒప్పందంపై సంతకం చేశారు. శాంతి ఒప్పందంపై సంతకం చేసిన విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ స్వయంగా మీడియాకు వెల్లడించారు.


ప్యాలెస్ నుంచి బయటకు వెళ్లిపోతున్న సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సంతకం చేయటం అయిపోయింది. ఇప్పుడే వర్సైల్లెస్‌లో ఒప్పందంపై సంతకం చేశాను’ అని చెప్పుకొచ్చారు. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘేయ్ ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ 'ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ' (IRNA)తో మాట్లాడుతూ.. ‘రెండు దేశాల అధ్యక్షుల సంతకాలతో ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం జరిగింది. ఇప్పుడు ఈ ఒప్పందం అమలును పరీక్షించాల్సిన సమయం వచ్చింది’ అని అన్నారు.


మాట తప్పితే బాంబులు వేస్తాం

శాంతి ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేశారు. శాంతి ఒప్పందానికి ఇరాన్‌ కట్టుబడి ఉండకపోతే ఆ దేశంపై మళ్లీ బాంబులు వేస్తామని హెచ్చరించారు. ‘అవగాహన ఒప్పందం (ఎంవోయూ) ఫైనల్‌ కాదు. అది నాకు నచ్చకపోయినా, వాళ్లు (ఇరాన్‌) దానికి కట్టుబడి ఉండకపోయినా.. మేము మళ్లీ ఇరాన్‌పై బాంబులు వేస్తాం. ఎందుకంటే ఇరాన్‌ గత 47 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉంది’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

స్వదేశీ కామికాజ్‌ డ్రోన్ల తయారీకి టెండర్లు

బాస్‌ పేరిట వాట్సాప్‌ మెసేజ్‌..

Updated Date - Jun 18 , 2026 | 07:20 AM