Share News

భర్త పైశాచికత్వం.. భార్యపై అనుమానంతో ఇంట్లో సీసీటీవీలు పెట్టి..

ABN , Publish Date - Jun 18 , 2026 | 12:09 PM

మహారాష్ట్రలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య మీద అనుమానంతో ఇంట్లో, బయట సీసీటీవీలు ఏర్పాటు చేశాడు. భార్య ప్రతి కదలికను గమనిస్తూ వేధింపులకు గురి చేశాడు.

భర్త పైశాచికత్వం.. భార్యపై అనుమానంతో ఇంట్లో సీసీటీవీలు పెట్టి..
Husband Surveillance Case

ముంబై, జూన్ 18: మహారాష్ట్రలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య మీద అనుమానంతో ఇంట్లో, బయట సీసీటీవీలు ఏర్పాటు చేశాడు. భార్య ప్రతి కదలికను గమనిస్తూ వేధింపులకు గురి చేశాడు. భర్త వేధింపులు తట్టుకోలేకపోయిన భార్య ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. పెళ్లై రెండు నెలలు కాకముందే ఈ విషాదం చోటుచేసుకోవటం గమనార్హం. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. థానేకు చెందిన నితిన్ తిల్కర్ అనే వ్యక్తికి విశాఖ తిల్కర్ అనే యువతితో ఏప్రిల్ 30వ తేదీన పెళ్లైంది.


పెళ్లైన తర్వాత కొన్ని రోజులు నితిన్ తన భార్యను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. ఆ తర్వాత మెల్లగా తన పాడు బుద్ది బయటపెట్టాడు. చిన్న చిన్న విషయాలకు ఆమెతో గొడవపడేవాడు. భార్య మీద అనుమానంతో ఇంట్లో, బయట సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఆమె ప్రతి కదలికను గమనిస్తూ వచ్చాడు. భార్య ఎవరితోనైనా మాట్లాడితే నితిన్ ఆమెను దారుణంగా కొట్టేవాడు. అత్తింటి వారు కూడా ఆమెను వేధింపులకు గురి చేయటం మొదలెట్టారు. పక్కింటి మహిళతో మాట్లాడిందన్న కారణంతో అత్తింటి వారు విశాఖను దారుణంగా కొట్టారు.


భర్త, అత్తింటి వారి వేధింపులు భరించలేకపోయిన విశాఖ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. విశాఖ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విశాఖ తల్లి మాట్లాడుతూ.. ‘కట్నంలో భాగంగా మేము ఇస్తామన్న బహుమతులు ఇవ్వకపోవటంతో విశాఖను ఆమె అత్తింటి వారు వేధింపులకు గురి చేశారు. విశాఖ నాకు ఫోన్ చేసి వేధింపుల గురించి చెప్పుకుని ఏడ్చింది. విశాఖను ఇంటికి తిరిగి తీసుకురావటానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే ఈ విషాదం జరిగింది’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.


ఇవి కూడా చదవండి

భార్యతో తరచూ గొడవలా? ఈ చిన్న మార్పులు మీ బంధాన్ని బలపరుస్తాయి

జులన్‌ గోస్వామి రికార్డును సమం చేసిన దీప్తి శర్మ

Updated Date - Jun 18 , 2026 | 01:06 PM