గాయని జానకి మృతి.. సంతాపం తెలిపిన చిరంజీవి, బాలకృష్ణ
ABN , Publish Date - Jul 11 , 2026 | 09:37 PM
ప్రముఖ గాయని జానకి మైసూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపై సినీ నటులు చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు.
హైదరాబాద్, జులై 11 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ గాయని జానకి (Singer Janaki) మైసూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపై సినీ నటులు చిరంజీవి, నందమూరి బాలకృష్ణ (Chiranjeevi, Nandamuri Balakrishna) సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా సంగీత ప్రపంచానికి ఆమె అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ మేరకు వారు ఓ ప్రకటన విడుదల చేశారు.
జానకి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది: చిరంజీవి
ప్రముఖ గాయని జానకి మరణవార్త తన హృదయాన్ని ఎంతో కలచివేసిందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారని స్మరించుకున్నారు. తాము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు జానకి స్వరమే ప్రాణం పోసిందని గుర్తుచేసుకున్నారు. తన కెరీర్‌లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక ఆమె మధుర గాత్రం ఉందని కీర్తించారు. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు.. ఆ జ్ఞాపకాలు.. మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు. జానకమ్మ ఓ గాయని మాత్రమే కాదని... భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి అని చెప్పుకొచ్చారు. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకమని తెలిపారు. ఒక అనుభూతి... ఒక జీవితకాలపు అనుబంధమని చిరంజీవి పేర్కొన్నారు.
ఓ మహోన్నత శిఖరం జానకమ్మని కోల్పోయాం: బాలకృష్ణ
ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరం జానకమ్మని కోల్పోయామని నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుందని స్మరించుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. జానకమ్మ... మీ స్వరం ఎప్పటికీ అమరమని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
క్రీడాకారుల కోసం స్పష్టమైన స్పోర్ట్స్ పాలసీ తెచ్చాం: సీఎం రేవంత్‌రెడ్డి
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం మీడియా కృషి చేయాలి: గవర్నర్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News