స్టేషన్ ఉన్నా.. ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగకపాయే..
ABN , Publish Date - May 20 , 2026 | 11:19 AM
అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో రైల్వేస్టేషన్ ఉన్నా.. పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపట్లేదు. దీంతో మండల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముదిగుబ్బ రైల్వే స్టేషన్‌లో ఆగని ఎక్స్‌ప్రెస్‌లు
ఇబ్బందులు పడుతున్న మండల వాసులు
కదిరి, ధర్మవరం వెళ్లాల్సిన దుస్థితి
ముదిగుబ్బ(అనంతపురం): అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో రైల్వేస్టేషన్ ఉన్నా.. పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపట్లేదు. దీంతో మండల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాలంటే దూరంలోనున్న ధర్మవరం, కదిరికి వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. ధర్మవరం నుంచి పాకాలకు డబుల్‌లైన్ ఏర్పాటైతే రైళ్ల రాకపోకలు మరింత పెరుగుతాయి. ముద్దనూరు నుంచి ముదిగుబ్బకు కొత్త రైలు మార్గం ఏర్పాటు చేస్తే జంక్షన్‌గా మారుతుంది. అభివృద్ధికి ఎంతో కీలకమైన ముదిగుబ్బలో నేటికీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపకపోవడం శోచనీయం.
ధర్మవరం-నర్సాపూర్, గుంతకల్లు-తిరుపతి మాత్రమే ఈ మార్గంలో ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. కాచిగూడ-మధురై ఎక్స్‌ప్రెస్ (22716), సికింద్రబాద్-తిరుపతి(12769), సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్, కాచిగూడ-తిరుపతి(12765) అమరావతి ఎక్స్‌ప్రెస్, ముంబై-నాగర్‌కోయిల్ ఎక్స్‌ప్రెస్(16340) రైళ్లు వారానికి రెండుసార్లు ముదిగుబ్బ మీదుగా వెళ్తున్నాయి. ముదిగుబ్బ నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో ఉద్యోగులు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ప్యాసింజర్ రైళ్లు ఉన్నా వచ్చి వెళ్లేందుకు సమయాల్లో మార్పు ఉండడంతో ఉపయోగం లేకుండా పోతోంది.
ముదిగుబ్బ మండలం నుంచే కాకుండా బుక్కపట్నం, పులివెందుల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో కళాశాలలకు వెళ్లడానికి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఎక్కాల్సి ఉంటుంది. ముదిగుబ్బలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపకపోవడంతో గత్యంతరంలేక ముదిగుబ్బ, కదిరి, ధర్మవరం వెళ్లి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అనేకసార్లు కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులకు ముదిగుబ్బ వాసులు వినతిపత్రాలు అందించినా ఫలితం శూన్యం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ముదిగుబ్బ రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు
పలువురు విద్యార్థులు మధురై, విజయవాడ, చెన్నైలో చదువుతున్నారు. పలువురు ఉద్యోగాలు చేస్తున్నారు. ముదిగుబ్బలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగకపోవడంతో కదిరి, ధర్మవరం వెళ్లాల్సి వస్తోంది. సంబంధిత అధికారులకు ఎన్నోసార్లు వినతిపత్రం అందించినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేలా చర్యలు తీసుకోవాలి.
- రాధాకృష్ణ, ముదిగుబ్బ
పుణ్యక్షేత్రాలకు వెళ్లాలంటే కష్టంగా ఉంది..
అరుణాచలం, మధురై తదితర పుణ్య క్షేత్రాలకు వెళ్లాలంటే ముదిగుబ్బ రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వృద్ధులు, చిన్నపిల్లలతో కదిరి, ధర్మవరం, అనంతపురం వెళ్లి రైలు ఎక్కాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
- వేలూరి హనుమంతు, ముదిగుబ్బ
ఈ వార్తలు కూడా చదవండి:
బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్ కలకలం..
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. బాపట్ల యువకుడి మృతి
Read Latest AP News And Telangana News And International News And Telugu News