Share News

పాలమూరు-రంగారెడ్డి ఈ టర్మ్‌లోనే

ABN , Publish Date - May 20 , 2026 | 03:50 AM

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఈ టర్మ్‌లోనే పూర్తి చేస్తామని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

పాలమూరు-రంగారెడ్డి ఈ టర్మ్‌లోనే

ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి భూసేకరణే ప్రధాన సమస్య

యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేయాలి

నిధులకు ఢోకా లేకుండా చేస్తా.. పెండింగ్‌ బిల్లులూ చెల్లిస్తా

మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి మరీ పూర్తి చేయించాలి

రిజర్వాయర్లు, ప్రధాన కాల్వల భూసేకరణపై దృష్టిసారించాలి

భూ సేకరణ పూర్తి కాగానే ప్రాజెక్టు పనులను ప్రారంభించాలి

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఈ టర్మ్‌లోనే పూర్తి చేస్తామని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిలిచిపోయిన భూ సేకరణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలందరూ పాలు పంచుకోవాలని, దగ్గరుండి మరీ పూర్తి చేయించాలని నిర్దేశించారు. భూసేకరణ పూర్తి కాగానే పనులు కూడా చేపట్టాలని స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో బీమా, నెట్టెంపాడు, కోయిల్‌ సాగర్‌; మక్తల్‌- నారాయణపేట- కొడంగల్‌; కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు అవసరమైన భూములను సేకరించే ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో మంగళవారం ఆయన ఎంసీహెచ్‌ఆర్డీలో ప్రాజెక్టులపై సమీక్షించారు. పాలమూరు- రంగారెడ్డికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యలను చర్చించారు. కొల్లాపూర్‌ నుంచి షాద్‌నగర్‌ వరకు నీటిని తీసుకెళ్లే ప్రధాన కాల్వలకు భూమిని సేకరించే ప్రక్రియ పెండింగ్‌లో పెట్టడమే ప్రధాన సమస్యగా గుర్తించారు. నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ భూమిని సేకరించాలి.. దానికి ఉన్న సమస్యలు ఏంటన్న దానిపై సమీక్ష చేశారు. ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తికాకపోవడానికి భూసేకరణ జరగకపోవడమే ప్రధాన కారణమని, దీన్ని గుర్తించే కాంగ్రెస్‌ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.5 వేల కోట్లను ప్రత్యేకంగా ప్రాజెక్టుల భూసేకరణకు కేటాయించామని గుర్తు చేశారు. భూ సేకరణపై నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి పూర్తి వివరాలు తనకు ఇవ్వాలని నిర్దేశించారు. ఆ సమావేశాలకు ఈఎన్‌సీలనూ పంపిస్తానని చెప్పారు. ప్రాజెక్టుల భూసేకరణను తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకుందని, భూ సేకరణకు నిధుల విడుదలలో ఎటువంటి జాప్యమూ ఉండబోదని, పెండింగ్‌ బిల్లుల చెల్లింపులను కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. కాంట్రాక్టులపై కాకుండా తొలుత రిజర్వాయర్లు, పంటలకు నీరందించే ప్రధాన కాల్వల భూ సేకరణపై దృష్టి పెట్టి పూర్తి చేస్తే ఆటంకాలు లేకుండా వేగంగా ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని సీఎం రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అలాగే, ఈ ప్రాజెక్టుకు 90 టీఎంసీల నికర జలాల కేటాయింపునకు కేంద్రాన్ని ఒప్పించే ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పినట్లు సమాచారం.


ఇప్పటికే రాజీవ్‌ బీమా ఎత్తిపోతల పథకంలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూసేకరణను పూర్తి చేశామని, కల్వకుర్తి పథకంలోనూ భూసేకరణకు నిధులు ఇచ్చామని తెలిపారు. మక్తల్‌- కొడంగల్‌ పథకంలో తొలుత భూములన్నీ సేకరించాకే టెండర్లు పిలిచి... పనులు చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పెండింగ్‌ ప్రాజెక్టులపై సమీక్ష చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు. సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, మధుసూదన్‌ రెడ్డి, మేఘా రెడ్డి, రాజేశ్‌ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, వీర్లపల్లి శంకరయ్య, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, సీఎస్‌ రామకృష్ణారావు పాల్గొన్నారు. కాగా.. సీఎం రేవంత్‌ రెడ్డి సూచన మేరకు మంగళవారం మంత్రి ఉత్తమ్‌తోనూ ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.

భూసేకరణపై 25, 26న సమావేశాలు

సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గాల వారీగా భూసేకరణ సమస్యలపై ఈనెల 25, 26 తేదీల్లో స్థానికంగా సమావేశాలు నిర్వహించాలని ఆ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్ణయించారు. లోక్‌సభ నియోజక వర్గాల వారీగా వీటిని నిర్వహించనున్నారు. 25న మహబూబ్‌నగర్‌, 26న నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గాల వారీగా జరగనున్నాయి. సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇరిగేషన్‌ శాఖ ఈఎన్‌సీ పాల్గొంటారు. జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలు సమావేశాలను నిర్వహించనున్నారు. భూ సేకరణ ప్రక్రియకు సంబంధించి ఈ సమావేశాల్లో పేపర్‌ వర్క్‌ పూర్తి చేసుకుని మరోమారు సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ కానున్నారు.

23న యాదగిరిక్షేత్రానికి సీఎం రేవంత్‌రెడ్డి

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఈనెల 23వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకోనున్నారు. ముఖ్యమంత్రి 23న ఉదయం 9.30 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. కంచికామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్రసరస్వతి ఆశీస్సులతో పెద్దగుట్ట వద్ద టెంపుల్‌ సిటీలో 15 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న వేదపాఠశాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కొండపై దాదాపు రూ.100కోట్ల నిధులతో నాలుగు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. కాగా, గోదావరి పుుష్కరాల్లోపు బాసర ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారుల్ని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. దేవాదాయ శాఖ అధికారులతో సీఎం మంగళవారం మాట్లాడారు. ఆలయ అభివృద్ధి నమూనాతోపాటు పనుల్ని వేగవంతంగా చేయాలని సూచించారు.

Updated Date - May 20 , 2026 | 05:58 AM