సాకులతో కోతలు.. వ్యవసాయ విద్యుత్ ఉంటే ఒట్టు
ABN , Publish Date - May 19 , 2026 | 11:09 AM
అనంతపురం జిల్లాలోని బోరుబావుల్లో వర్షాకాలంలో నీరు రావడమే కష్టం. అలాంటిది వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
బ్రేక్ డౌన్, ఎల్‌సీ అంటున్న సిబ్బంది
నీరు అందక ఎండుతున్న పంటలు
ఆలమూరు ఫీడర్ కింద అవస్థలు
అనంతపురం: అనంతపురం జిల్లాలోని బోరుబావుల్లో వర్షాకాలంలో నీరు రావడమే కష్టం. అలాంటిది వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. తోట పంటలు పెట్టుకున్న రైతులు నీటి కోసం నిత్యం బోరుబావుల జూదం ఆడుతుంటారు. రూ.లక్షలు వెచ్చింది అప్పులపాలవుతుంటారు. వారికి ఈ కష్టాలు చాలవన్నట్లు విద్యుత్ కోతలతో ఆ శాఖ అధికారులు వేధిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ కోతలతో రైతులు అల్లాడిపోతున్నారు. అనంతపురం రూరల్ మండలం పరిధిలోని ఆలమూరు ఫీడర్‌లో విద్యుత్ సమస్య మరింత తీవ్రంగా ఉంది. వివిధ రూపాల్లో కరెంటు కోతలు పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రేయింబవళ్లు పొలాల్లోనే ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిరంతర అంతరాయాలు
ఆలమూరు ఫీడర్ పరిధిలో పదకొండు వందలకు పైగా వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. ఈ ఫీడర్ పరిధిలో ఆలమూరు, ఎంబీ పల్లి, కట్టకిందపల్లి, కాటిగానికాలువ, కక్కలపల్లి, ఆత్మకూరు మండలంలోని యాలేరు, రంగపేట ప్రాంతాల్లో కొత్తభాగం ఉన్నాయి. ఈ ప్రాంతాలకు వ్యవసాయ విద్యుత్ సరఫరా అధ్వానంగా మారింది. నిత్యం అంతరాయాలే అని రైతులు అంటున్నారు. లోడ్ ఎక్కువైనప్పుడు లో వోల్జేజీ సమస్య తలెత్తుతోంది. దీనికితోడు బ్రేక్ డౌన్ పేరిట గంటల తరబడి కరెంట్ కోత విధిస్తున్నారు. ఆలమూరు ఫీడర్ అనంతపురం నగరానికి దగ్గరగా ఉంది. దీంతో విద్యుత్ సిబ్బంది ఎక్కువగా ఎల్‌సీలు తీసుకుని ప్రైవేట్ పనులు చేసుకుంటున్నారని రైతులు మండిపడుతున్నారు.
పంటసాగుకు అవస్థలు
ఆలమూరు, ఎంబీ పల్లి, కక్కలపల్లి, కాటిగానికాలువ తదితర ప్రాంతాల్లో ఉద్యాన పంటలు ఎ క్కువగా ఉన్నాయి. దానిమ్మ, చీనీ, అరటి, టమో టా, దోస, వేరుశనగ, అనప వంటి పంటలను సా గు చేశారు. వేసవిలలో వీటికి నీరు అందించేందుకు రైతులు పడే కష్టాలు వర్ణతీతం. ఎండలు మండిపోతున్నాయి. నీరు విధిగా అధించకపోతే పంటలు దెబ్బతింటాయి. నీరు సక్రమంగా వెళితేనే డ్రిప్‌ల ద్వారా పంటలకు మందులు సరిగా చేరుతాయి. కానీ విద్యుత్ కోతల కారణంగా మొక్కలకు, చెట్లకు మందులు సరిగా అందించకలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఇతర పనులు మానుకుని పొలాల్లో కరెంటు కోసం కాపుకాయాల్సి వస్తోందని అంటున్నారు.
సబ్‌స్టేషన్ ఏర్పాటుకు వినతి
విద్యుత్ సమస్య పరిష్కారం కావాలంటే సబ్‌స్టేషన్ ఏర్పాటు ఒక్కటే మార్గమని ఆ శాఖవర్గాలు అంటున్నాయి. కొత్త సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు పలుమార్లు విన్నవించామని బాధిత రైతులు అంటున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత దృష్టికి కూడా తీసుకెళ్లామని చెబుతున్నారు. సబ్‌స్టేషన్ ఏర్పాటుకు కావాల్సిన స్థలంకు కూడా అందుబాటులో ఉందని అంటున్నారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆలమూరులో సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయించాలని కోరుతున్నారు.
సబ్ స్టేషన్ వస్తేనే..
ఫీడర్‌లో నిత్యం కరెంటు పోతోంది. సబ్‌స్టేషన్ సిబ్బందికి ఫోన్ చేస్తే బ్రేక్ డౌన్, ఎల్‌సీ తీసుకున్నారు అని చెబుతున్నారు. ఇలా ఎప్పుడు తీసేసినా అరగంట నుంచి గంటకుపైగానే కరెటు పోతోంది. తరచూ కోతల కారణంగా పంటకు నీరందించడం సాధ్యం కావడంలేదు. డ్రిప్ ద్వారా మందులు అదించేందుకూ అవస్థలు తప్పడం లేదు. సబ్‌స్టేషన్ వస్తుంది అంటున్నారు. ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాం. విద్యుత్ కోతలకు భయపడి టమోటా సాగును వాయిదా వేసుకున్నాను. వర్షం వస్తే నాటుకుంటాను.
ఓబులపతి, ఆలమూరు
పంటసాగుకు అవస్థలు
వ్యవసాయ విద్యుత్ సరఫరా అధ్వానంగా మారింది. కరెంటు పోని రోజంటూ లేదు. రోజుకు ఎంత లేదన్నా పదిసార్లు కట్ చేస్తారు. దీంతో పంటకు నీరందించేందుకు నానా అవస్థలు పడుతున్నాం. మా సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎప్పటికి తీరుతుందో తెలియడం లేదు. పదిరోజుల కిందట టమోటా మొక్కలు నాటాను. ఎండ తీవ్రతకు తట్టుకుని నిలబడాలంటే నీటి తడులు తప్పనిసరి. అధికారులు, నాయకులు స్పందించి, సమస్య లేకుండా చూడాలి.
నాగరాజు, ఆలమూరు
ఈ వార్తలు కూడా చదవండి:
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నాలుగు రోజుల్లో రెండోసారి..
తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు..
Read Latest AP News And Telangana News And International News And Telugu News