Share News

నేటి నుంచి వడగాడ్పులు

ABN , Publish Date - May 19 , 2026 | 03:58 AM

రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ నెల 25న రోహిణి కార్తె ప్రవేశించనుంది.

నేటి నుంచి వడగాడ్పులు

  • వారం రోజులపాటు ఎండ మంటలు

  • ఉష్ణోగ్రతలు 45-47 డిగ్రీల వరకు నమోదు

  • వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడి

  • అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిక

విశాఖపట్నం, అమరావతి, మే 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ నెల 25న రోహిణి కార్తె ప్రవేశించనుంది. దానికి ముందే రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారనున్నాయని వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించాయి. సోమవారం కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల ఉదయం నుంచి ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగింది. పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం విజయనగరం, పార్వతీపురం, పోలవరం, ఏలూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. ఈ నెల 25 వరకు అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తాయని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. కాగా, సోమవారం రాయలసీమ, కోస్తాల్లో పలుచోట్ల ఈదురు గాలులతో వర్షాలు కురిశాయి. సోమవారం అరేబియా సముద్రం, బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రంలో పలు ప్రాంతాలు, అండమాన్‌ దీవుల నైరుతి రుతుపవనాలు విస్తరించాయి.

Updated Date - May 19 , 2026 | 04:00 AM