Share News

సోషల్‌ మీడియాపై సాక్‌ ఐ

ABN , Publish Date - May 19 , 2026 | 07:37 AM

సోషల్‌ మీడియాలో ఏది పడితే అది మాట్లాడుతున్నారా? సున్నితమైన అంశాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారా? మమ్మల్ని ఎవరూ పట్టుకోలేరులే అనుకుంటున్నారా? అయితే ఇకపై అలాంటి వారు తస్మాత్‌ జాగ్రత్తగా ఉండాల్సిందే.

సోషల్‌ మీడియాపై సాక్‌ ఐ
Artificial Intelligence

  • ఏఐతో నిరంతరం నిఘా

  • రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఉక్కుపాదం

హైదరాబాద్‌ సిటీ: సోషల్‌ మీడియాలో ఏది పడితే అది మాట్లాడుతున్నారా? సున్నితమైన అంశాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారా? మమ్మల్ని ఎవరూ పట్టుకోలేరులే అనుకుంటున్నారా? అయితే ఇకపై అలాంటి వారు తస్మాత్‌ జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్‌ సిటీ పోలీసులు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో కూడిన సోషల్‌మీడియా అబ్జర్వేషన్‌ అండ్‌ సైబర్‌ ఇంటెలిజెన్స్‌ (సాక్‌ ఐ) అనే ప్రత్యేక అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్‌ను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ సోమవారం ప్రారంభించారు.


అత్యాధునిక వ్యవస్థ

నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఆన్‌లైన్‌ వేదికలపై తప్పుడు ప్రచారాలు చేసే వారిని పసిగట్టడంతో పాటు, అసాంఘిక శక్తుల కదలికలను విశ్లేషించేందుకు ఈ అత్యాధునిక వ్యవస్థను హైదరాబాద్‌ పోలీస్‌ ఐటీ విభాగం రూపొందించింది. ‘సాక్‌ ఐ’ ద్వారా ఇకపై అన్నీ ఆటోమేటెడ్‌ పద్థతిలో నిరంతరాయంగా జరుగుతాయి. దీనిలోని ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెంట్‌ డ్యాష్‌బోర్డ్‌ ద్వారా డయల్‌ 100 కాల్స్‌, అంతర్గత నిఘా సమాచారం, నగరంలో జరుగుతున్న ప్రధాన ఘటనల వివరాలను ఒకేచోట క్రోడీకరించి అధికారులకు పూర్తి స్థాయి క్షేత్రస్థాయి అవగాహన కల్పిస్తుంది. అత్యాధునిక ఏఐ సాంకేతికతతో కూడిన ఈ ‘సాక్‌ ఐ’ వ్యవస్థ పోలీసుల పనిభారాన్ని తగ్గించడమే కాకుండా, నేర నివారణలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


city1.jpgఅద్భుత విజయాలు

సాక్‌ ఐ తన ప్రయోగాత్మక దశలోనే అద్భుతమైన విజయాన్ని సాధించింది.

  • ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పురానాపూల్‌ ఎక్స్‌రోడ్‌ ఘటనకు సంబంధించి 85 ద్వేషపూరిత, మతపరమైన సున్నితమైన అంశాలను గుర్తించింది.

  • గుడిమల్కాపూర్‌ వివాదానికి సంబంధించి పలు సోషల్‌ మీడియా ఖాతాలలో ఉన్న 126 పోస్ట్‌లను సాక్‌ ఐ గుర్తించింది.

  • మాదకద్రవ్యాల సరఫరా, మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై ఈ వ్యవస్థ దృష్టి పెడుతోంది.

  • చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్‌, సైబర్‌ బుల్లింగ్‌, స్టాకింగ్‌ వంటి అంశాలను ఏఐ మోడల్స్‌ స్వయంగా గుర్తించి అప్రమత్తం చేస్తాయి.


  • పోస్టుల తీవ్రతను బట్టి వాటిని హై, మీడియం, లో రిస్క్‌ కేటగిరీలుగా విభజిస్తుంది.

  • అభ్యంతరకర పోస్టులను తొలగించేలా సంబంధిత సోషల్‌మీడియా సంస్థలకు నివేదిస్తుంది.

  • ప్రజా సమస్యల పరిష్కారం కోసం సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా ఇది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది.

  • ప్రతి ఫిర్యాదుకు ఒక యూనిక్‌ ట్రాకింగ్‌ నంబర్‌ కేటాయించి, అది పరిష్కారమయ్యే వరకు ఎండ్‌-టు-ఎండ్‌ మానిటరింగ్‌ చేస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

యూరియాకు ప్రత్యేక కార్డుల విధానం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 19 , 2026 | 07:37 AM