Share News

ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం.. లోటస్‏పాండ్‌

ABN , Publish Date - May 19 , 2026 | 08:55 AM

హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12 ఎమ్మెల్యే కాలనీలో ఉన్న లోటస్‏పాండ్‌లో అడుగుపెట్టగానే నగర హడావుడి ఒక్కసారిగా మాయమైపోతుంది.

ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం.. లోటస్‏పాండ్‌
Lotus Pond, Hyderabad

  • వేసవిలోనూ చల్లటి గాలులు

  • వర్షపు నీటితో నిండే సహజ కొలను

  • పచ్చని చెట్ల మధ్య వాకింగ్‌ ట్రాక్‌

  • సందర్శకులను ఆకట్టుకుంటున్న సహజ అందాలు

హైదరాబాద్: హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12 ఎమ్మెల్యే కాలనీలో ఉన్న లోటస్‏పాండ్‌లో అడుగుపెట్టగానే నగర హడావుడి ఒక్కసారిగా మాయమైపోతుంది. ఎత్తైన కొండలు.. వాటిని ఆనుకుని నిర్మించబడ్డ ఇళ్లు. వీటికి సరిగ్గా మధ్యలో నీటి కొలను.. చుట్టూ పచ్చటి చెట్లు.. ఎటూ చూసినా అహ్లాదకరమైన వాతావరణం అందిస్తోంది. మండు వేసవిలోనూ ఇక్కడివాతావరణం చల్లగా ఉంటుంది. ప్రకృతి అందాలు ఆస్వాదించేందుకు ఎంతో మంది సందర్శకులు ఇక్కడకు వస్తుంటారు. చుట్టూ ఖరీదైన భవంతులు వాటికి మధ్యలో అందంగా కనిపించే ఈ పార్కు బంజారాహిల్స్‌కు మరింత అందాలను తెచ్చిపెడుతుంది.


city4.2.jpgఏర్పాటు ఇలా..

బంజారాహిల్స్‌ ఒకప్పుడు కొండ చరియల ప్రాంతం. ముఖ్యంగా ఎమ్మెల్యే కాలనీలో ప్రస్తుతం పార్కు ఉన్న ప్రాంతంలో చుట్టూ ఎత్తైన గుట్టలు ఉండేవి. వర్షం పడినప్పుడు ఆ గుట్టల మీది నుంచి నీటితో ఇక్కడ కొలను ఏర్పడింది. కొండలను ఆనుకుని అందమైన భవంతులు నిర్మాణమయ్యాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొలను చుట్టూ ఓ పార్కు అభివృద్ధి చేయాలని అప్పటి పాలకులు నిర్ణయించారు. దాదాపు 30ఎకరాల స్థలం సేకరించారు. 1999లో పార్కు పనులు మొదలయ్యాయి. 2001లో దీన్ని సందర్శకులకు కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. చలికాలం మొదలు కాగానే కొలనులో తామర పువ్వులు అధికంగా పూస్తుండటం గమనించి జీహెచ్‌ఎంసీ ఈ పార్కుకు లోటస్‌ పాండ్‌ అని నామకరణం చేసింది.


zz.jpgప్రకృతి సోయగం..

పార్కు వచ్చే వారికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ఇక్కడ సకల సదుపాయాలు కల్పించారు. పర్యావరణానికి ఏ మాత్రం ఆటంకం వాటిల్లకుండా ఉన్న సహజ వనరులను పచ్చని లోగిళ్లుగా మార్చారు. వాకర్స్‌ కోసం 1.2 కిలోమీటర్ల పొడవు వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేశారు. వాకింగ్‌ పాత్‌కు రెండు వైపులా పచ్చటి చెట్లు ఆహ్లాదపరుస్తూ ఉంటాయి. అడవికి వెళ్లిన అనుభూతిని పంచుతుంది. మధ్యమధ్యలో చెక్క బ్రిడ్జిలు, కర్రలతో తయారు చేసిన షెడ్లు వంటివి పార్కుకు అదనపు అందాలను తెచ్చిపెడుతున్నాయి. వర్షపు నీటితోనే కొలను నింపుతారు. వేసవిలో కూడా నీరు అలాగే ఉంటుంది. అయితే వర్షాకాలం పూర్తయిన తరువాత పార్కు అందాలు మరింత అద్భుతంగా ఉంటాయని సందర్శకులు చెబుతున్నారు. పార్కు చివరలో గుబురు గుబురు చెట్లతో చిట్టడివి వచ్చిన అనుభూతి కలుగుతుందంటే ఆశ్చర్యపోనవసరం లేదు.


zzz.jpgవలస పక్షుల సందడి..

లోటస్‌పాండ్‌ ప్రత్యేకతల్లో మరోటి వలస పక్షులు. సీజన్‌ను బట్టి లిటిల్‌ గ్రెబి, కామన్‌ కూట్‌, వైట్‌ వాగ్‌టైల్‌, లిటిల్‌ ఎగ్రెట్‌, పైడ్‌ కింగ్‌ఫిషర్‌, కామన్‌మూన్‌హెన్‌, సన్‌బర్డ్స్‌ తదితర జాతుల పక్షులు ఇక్కడ కనువిందు చేస్తుంటాయి. నీటి కొలను వద్ద ఉన్న చెట్లపై విశ్రాంతి తీసుకుంటూ సందర్శకులను ఆకట్టుకుంటాయి. పక్షుల కిలకిలారావాలు పార్కుకు మరింత జీవాన్ని తీసుకొస్తాయి. అంతే కాదు వేప, కస్టర్‌ ఆపిల్‌, బాంబూ, సింగపురే చెర్రి, ఆస్ట్రేలియన్‌ తుమ్మ వంటి చెట్లు ఇక్కడ కనిపిస్తాయి. చెట్లు వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ జీహెచ్‌ఎంసీ బోర్డులు ఏర్పాటు చేసింది. నగర ప్రజలకు ఇది కేవలం పార్కు మాత్రమే కాదు.. ప్రకృతితో మమేకమయ్యే ఓ అందమైన అనుభూతి.


ఎలా చేరుకోవాలంటే..

లోటస్‏పాండ్‌కు జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ మీదుగా వెళ్లవచ్చు. బస్సులో వచ్చే వారు ఎమ్మెల్యే కాలనీ వరకు వచ్చి అక్కడినుంచి కొద్ది దూరం నడిస్తే పార్కుకు చేరుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం 6నుంచి 10గంటల వరకు సాయంత్రం 4నుంచి 6గంటల వరకు పార్కు తెరిచి ఉంటుంది. ప్రవేశ రుసుము ఉచితం. ద్విచక్రవాహనాలు, కార్లు పార్క్‌ చేసుకునే వసతి ఉంది.


నగర జీవితం అంటే ఉరుకులు.. పరుగులు, కాలుష్యం, ట్రాఫిక్‌ రద్దీ, కాంక్రీట్‌ భవనాల మధ్య ఊపిరాడని వాతావరణం గుర్తుకు వస్తుంది. అలాంటి మహానగరం మధ్యలోనే ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్లే ప్రశాంత ప్రదేశం ఒకటి ఉంది. ఈ పేరు చెప్పగానే కళ్ల ముందుకు వచ్చే నీటి కొలను, పచ్చటి చెట్లు, పక్షుల కిలకిలారావాలు అక్కడికి వెళ్లిన వారిని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. వేసవి ఎండలు మండుతున్నా అక్కడ అడుగుపెడితే చల్లటి గాలి మనసుకు హాయిని అందిస్తుంది. నగర ప్రజలకు ప్రకృతిని మరింత దగ్గర చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఆ ప్రదేశం లోటస్‌ పాండ్‌.


ఈ వార్తలు కూడా చదవండి:

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నాలుగు రోజుల్లో రెండోసారి..

తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 19 , 2026 | 08:55 AM