Share News

రష్యా చమురుపై అమెరికా మరో నెల మినహాయింపు

ABN , Publish Date - May 19 , 2026 | 07:43 AM

రష్యా ముడి చమురుపై అమెరికా మరోసారి ఆంక్షల సడలింపును జూన్ 17 వరకు పొడిగించింది. అయితే, ఈ నిర్ణయం తమ చమురు కొనుగోళ్లపై ఎలాంటి ప్రభావం చూపదని భారత్ స్పష్టం చేసింది.

రష్యా చమురుపై అమెరికా మరో నెల మినహాయింపు
US Extends Russian Oil Exemption

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ట్రెజరీ విభాగం రష్యా ముడి చమురుపై ఉన్న ఆంక్షల మినహాయింపును మరో నెలపాటు పొడిగించింది. సముద్ర మార్గంలో ఇప్పటికే ప్రయాణిస్తున్న రష్యన్ చమురు రవాణాలకు ఈ సడలింపు వర్తిస్తుంది. కొత్తగా జారీ చేసిన జనరల్ లైసెన్స్ 134C ప్రకారం, ఏప్రిల్ 17కు ముందు సముద్రంలో ఉన్న రష్యన్ చమురు రవాణాలకు జూన్ 17 వరకు అనుమతి ఉంటుంది. అయితే.. ఇరాన్‌, ఉత్తర కొరియా, క్యూబా లేదా రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు లేదా సంస్థలతో జరిగే లావాదేవీలకు ఈ మినహాయింపు వర్తించదు.


జూన్ 17 వరకు ఆంక్షల సడలింపు

ఇప్పటికే అమెరికా మార్చి 5 నుంచి ఒక నెలపాటు భారత్ సహా కొన్ని దేశాలకు రష్యన్ చమురు కొనుగోళ్లపై ఆంక్షల సడలింపు ఇచ్చింది. ఆ గడువును తర్వాత ఏప్రిల్ 11 వరకు, ఆపై మే 16 వరకు పొడిగించింది. ఇప్పుడు మరోసారి జూన్ 17 వరకు గడువు పెంచింది. ప్రపంచ చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లను స్థిరంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


ఆంక్షలు ఉన్నా.. లేకున్నా

ఇక భారత్ మాత్రం అమెరికా మినహాయింపులు ఉన్నా లేకపోయినా, రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగుతాయని స్పష్టం చేసింది. పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, భారత్ తీసుకునే నిర్ణయాలు పూర్తిగా వాణిజ్య అవసరాలు, సరఫరా పరిస్థితుల ఆధారంగానే ఉంటాయని తెలిపారు. 'రష్యాపై ఆంక్షలు ఉన్నప్పుడూ ఆ దేశ చమురును కొనుగోలు చేశాం.. ఆంక్షలు సడలించాక కూడా కొన్నాం.. ఇక ముందు కూడా రష్యా చమురును భారత్‌ కొనుగోలు చేస్తుంది' అని ఆమె చెప్పారు. దీర్ఘకాలిక ఒప్పందాల వల్ల దేశానికి తగినంత ముడి చమురు అందుతోందని, ఎలాంటి కొరత లేదని వివరించారు.

2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా తక్కువ ధరలకు చమురును భారత్ వంటి దేశాలకు విక్రయించడం ప్రారంభించింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగిన సమయంలో చౌకైన రష్యన్ చమురు భారత్‌కు పెద్ద ఊరటగా మారింది. ప్రస్తుతం కూడా భారత దిగుమతుల్లో రష్యన్ చమురు కీలక పాత్ర పోషిస్తోంది.


Also Read:

ఒకటి కాదు.. రెండు రహస్య బేస్‌లు

ఖతార్‌ విలవిల

For More Latest News

Updated Date - May 19 , 2026 | 08:53 AM