కందిపప్పు ఏదీ.. ఎదురుచూస్తున్న కార్డుదారులు
ABN , Publish Date - Sep 12 , 2026 | 01:48 PM
ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికి సరుకుల పంపిణీ అంటూ నానా హంగామా చేశారు.
నిత్యావసరాల పంపిణీలో జాప్యం
ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికి సరుకుల పంపిణీ అంటూ నానా హంగామా చేశారు. పేదలకు చేరాల్సిన బియ్యం, ఇతర నిత్యావసరాలు యథేచ్ఛగా పక్కదారి పట్టించి సొమ్ము చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రజల్లో ఆశలు చిగురించాయి. పేద, మధ్యతరగతి ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా నాణ్యమైన నిత్యావసర సరుకులు అందుతాయని భావించారు.
ధర్మవరం(అనంతపురం): కూటమి ప్రభుత్వం ప్రారంభంలో రేషన్ దుకాణాల్లో బియ్యం, చక్కెర, జొన్నలతో పాటు కంది పప్పును సైతం అందించింది. ఒక్కో కార్డుదారుడికి కిలో కందిపప్పు రూ.67తో పంపిణీ చేసింది. ఒకటి,రెండు నెలలు మాత్రమే కందిపప్పు పంపిణీ సాగింది. తర్వాత రేషన్‌దుకాణాల్లో కందిపప్పు కనబడకుండా పోయింది. కందిపప్పు సరఫరా చేయకపోవడంతో కార్డుదారులు నిరాశ చెందుతున్నారు.
పెరిగిన కందిపప్పు ధర
ప్రస్తుతం మార్కెట్‌లో కందిపప్పు ధర నాణ్యతను బట్టి రూ.120 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. గతంలో ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో కిలో కందిపప్పు రాయితీపై రూ.67కు అందజేసింది. ఈ ధర కంటే కందిపప్పు ధర రెట్టింపు ఉండటంతో పేదలు కొనలేకపోతున్నారు. మార్కెట్‌లో చక్కెర ధర రూ.70 వరకు ఉంది. జిల్లాలో కొన్ని స్టోర్లలో చక్కెర స్టాకు తక్కువగా వచ్చిందని చెప్పి అరకొరగా సరఫరా చేసి మిగిలింది మార్కెట్ విక్రయిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. స్టోర్లలో చక్కెర కిలో రూ.20కి విక్రయిస్తున్నారు.
కందిపప్పు సరఫరా చేయాలి
రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, చక్కెరతో పాటు కందిపప్పు తక్కువ ధరకు అందించాలి. ప్రస్తుతం బయట మార్కెట్‌లో కందిపప్పు, చక్కెర ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కుటుంబ పోషణ భారమయింది. ధరలను ప్రభుత్వం నియంత్రించాలి. ప్రతినెలా రేషన్ దుకాణాల్లో కందిపప్పు కూడా పంపిణీ చేయాలి.
లింగమ్మ, ధర్మవరం
రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాం
కందిపప్పు కోసం రెండేళ్లగా ఎదురుచూస్తున్నాం. గత ప్రభుత్వంలో కందిపప్పు ఇవ్వలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో రెండుసార్లు మాత్రమే రేషన్‌దుకాణాల్లో ఇచ్చారు. మళ్లీ ఇంతవరకు ఇవ్వలేదు. రేషన్ దుకాణాల్లో రూ.67లకే కందిపప్పు దొరుకుతుంది. బయట షాపుల్లో కొనాలంటే రూ.120 పెట్టాల్సి వస్తోంది.
లలితమ్మ, ధర్మవరం
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం
కందిపప్పు కోసం కార్డుదారుల నుంచి వస్తున్న అభ్యర్థనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రతినెలా ఇండెంట్‌పెడుతున్నాం. ప్రజాపంపిణీ వ్య వస్థలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి విడుదలయిన వెంటనే రేషన్‌దుకాణాలకు కందిపప్పును సరఫరా చేస్తాం.
వంశీకృష్ణారెడ్డి, డీఎస్వో
ఈ వార్తలు కూడా చదవండి:
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. వైద్య సేవల్లో కొత్త అధ్యాయం
రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News