Share News

తెలంగాణ ఆర్థిక ప్రగతికి హైదరాబాద్ అత్యంత కీలక ప్రాంతం: మంత్రి శ్రీధర్ బాబు

ABN , Publish Date - Sep 12 , 2026 | 11:28 AM

హైదరాబాద్ మహానగరానికి డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. వేగంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ను రాబోయే 20 నుంచి 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నగర పాలనను మార్చాల్సి ఉందన్నారు.

తెలంగాణ ఆర్థిక ప్రగతికి హైదరాబాద్ అత్యంత కీలక ప్రాంతం: మంత్రి శ్రీధర్ బాబు
TG Minister Duddilla Sridhar Babu

హైదరాబాద్, సెప్టెంబర్ 12: హైదరాబాద్ మహానగరానికి డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. వేగంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ను రాబోయే 20 నుంచి 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నగర పాలనను మార్చాల్సి ఉందన్నారు. శనివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మరింత చేరువగా, సమర్థవంతంగా, సమన్వయంతో పరిపాలన అందించాలని తెలిపారు. ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా నగర పాలనను తీర్చిదిద్దాలని చెప్పారు. క్యూర్ యాక్ట్- 2026 ప్రధాన ఉద్దేశం ఇదేనని ఆయన స్పష్టం చేశారు.


400 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్.. ఎన్నో రాజ వంశాలు, సంస్కృతులను కలుపుకుని ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగిందని గుర్తు చేశారు. చార్మినార్ నుంచి హైటెక్ సిటీ వరకు, మూసీ తీరం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు.. హైదరాబాద్ ప్రయాణం గొప్ప పరిణామానికి నిదర్శనమని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. కొన్ని లక్షల జనాభా కలిగిన నగరం ప్రస్తుతం కోటికిపైగా ప్రజలు నివసించే మహానగరంగా విస్తరించిందని ఐటీ మంత్రి చెప్పారు.


ఐటీ, ఫార్మా, బయో టెక్నాలజీ, ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్ సైన్సెస్, డేటా సెంటర్లు, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. హైదరాబాద్ గత వైభవాన్ని కాపాడుకోవడంతో పాటు భవిష్యత్ అవసరాలకు సిద్ధం కావాల్సి ఉందన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్‌ను ప్రభుత్వం రూపొందించి ప్రజల ముందు ఉంచిందని వివరించారు. 2034 నాటికి తెలంగాణను ఓ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.


2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ లక్ష్యాలను సాధించాలంటే హైదరాబాద్ మరింత ఆధునాతనంగా అంతర్జాతీయ స్థాయికి చేరాలని అన్నారు. హైదరాబాద్‌కు భారీగా పెట్టుబడులు రావడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు రావాలని ఆకాంక్షించారు. ఉద్యోగ అవకాశాలు పెరగాలని తెలిపారు.


ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు హైదరాబాద్‌లో ఉండాలని పేర్కొన్నారు. పరిపాలన వేగంగా, పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. హైదరాబాద్ కేవలం దేశంలోని ఇతర మహానగరాలతో పోటీ పడే నగరం కాదని.. తెలంగాణ ఆర్థిక ప్రగతికి ఇది అత్యంత కీలకమైన ప్రాంతమని గుర్తు చేశారు. క్యూర్ ప్రాంతం రాష్ట్ర విస్తీర్ణంలో చిన్నది అయినా తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో దాని పాత్ర చాలా పెద్దదని చెప్పారు. 2025 - 26లో తెలంగాణ రాష్ట్ర జీఎస్‌డీపీ సుమారు రూ.17.82 లక్షల కోట్లకు చేరిందని వివరించారు.


గత ఏడాది రూ.16.09 లక్షల కోట్లతో పోలిస్తే 10.7 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు. సేవా రంగం, పెట్టుబడులు, ఉద్యోగాలకు హైదరాబాద్ మహానగరం ప్రధాన కేంద్రంగా ఉందని గుర్తు చేశారు. క్యూర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలు రాష్ట్ర ఆర్థిక ఉత్పత్తిలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని సోదాహరణగా వివరించారు.


హైదరాబాద్ అభివృద్ధి అంటే కేవలం సిటీ డెవలప్‌మెంట్ కాదని.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఓ ప్రధాన గ్రోత్ ఇంజన్ అని అభివర్ణించారు. అందుకే క్యూర్ ప్రాంతంలోని పరిపాలనా వ్యవస్థను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సమీక్షలు నిర్వహించి అధికారులు, నిపుణులతో రాష్ట్ర ప్రగతిని కోరుకునే పలువురు ప్రముఖులతో సంప్రదింపులు జరిపారని వివరించారు. అనేక చర్చల అనంతరం ఈ కొత్త కాన్సెప్ట్‌ను తీసుకువస్తున్నామని మంత్రి వివరించారు.


హైదరాబాద్ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిందని గుర్తు చేశారు. ప్రతి రోజు నగరం ఏ విధంగా విస్తరిస్తుందో మన కళ్ల ముందే కనిపిస్తోందన్నారు. ఈ విస్తరణను దృష్టిలో పెట్టుకుని ఓఆర్‌ఆర్ పరిధిలో నిర్ణయాలు అమలు చేసేందుకు ప్రత్యేక కార్యనిర్వాహక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. నీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ, రవాణా, ట్రాఫిక్, వరదల నియంత్రణ, చెత్త నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై సమన్వయంతో పని చేసే వ్యవస్థ అవసరమని అన్నారు. క్యూర్ ప్రాంతానికి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సమర్థవంతమైన నగర పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీఆర్ఎస్ నేతల భూ దందాల భాగోతం మొత్తం బయటపెడతాం: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

బొల్లారం ఆయుధాల చోరీ.. మల్లేశ్‌కు రిమాండ్ విధించిన కోర్టు

For More TG News And Telugu News

Updated Date - Sep 12 , 2026 | 11:45 AM