ఎన్నికల విధుల్లో పోలింగ్ అధికారిణి హరిత మృతి.. సీఎం విచారం
ABN , Publish Date - Nov 05 , 2026 | 05:23 PM
ఎన్నికల విధుల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. పోలింగ్ అధికారిణి హరిత గౌడ్ (58) మృతిచెందారు. ఆమె మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ విచారం వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లా, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల విధుల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. పోలింగ్ అధికారిణి హరిత గౌడ్ (58) మృతిచెందారు. అనంతపురం జిల్లా కాడదారకుంట పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. పోలింగ్ విధుల్లో ఉండగా శ్వాసకోశ సమస్యతో హరిత కుప్పకూలింది. హుటాహుటిన కూడేరు పీహెచ్‌సీకి ఆమెను తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశారు. డి.హీరాహల్ మండలం పూలకుర్తిలో మృతురాలు హరిత ఎస్జీటీగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.
హరిత కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు
హరిత మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని సీఎం భరోసా కల్పించారు.
పోలింగ్ అధికారిణి హరిత గౌడ్ మృతిపై మంత్రి లోకేశ్ విచారం..
పోలింగ్ అధికారిణి హరిత గౌడ్ మృతిపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం కాడదారకుంటలో ఏపీవోగా విధులు నిర్వహిస్తున్న టీచర్ హరిత గౌడ్ గుండెపోటుతో కన్నుమూయడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఆమె అస్వస్థతకు గురైన వెంటనే అత్యవసర వైద్యం అందించినా ఫలితం లేక మృతిచెందారని తెలిపారు. ఆమె మృతి పట్ల నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా హరిత గౌడ్ కుటుంబ సభ్యులకు మంత్రి లోకేశ్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నాంది ఫౌండేషన్ 28 ఏళ్ల ప్రస్థానం.. ఆనంద్ మహీంద్రాకు చంద్రబాబు థ్యాంక్స్
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ ప్రణాళిక: ఏపీ ఎస్‌ఈసీ
ఏలూరు జిల్లాలో వరదలు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News