Midday Meal Scam: మధ్యాహ్న భోజనంలో గుడ్డు మాయం.!
ABN , Publish Date - Jan 05 , 2026 | 12:39 PM
ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో గుడ్డు మాయమవుతోంది. ఎప్పుడిస్తారో తెలీదు అస్సలు ఇస్తారో.. లేదో, కూడా తెలీదు. విషయం ఉన్నతాధికారుల నుంచి హెచ్ఎంల వరకు అందరికీ తెలిసినా ఎవ్వరూ నోరుమెదపరు. బిల్లులు మాత్రం ఎంచక్కా ఇచ్చేస్తున్నారు.
అనంతపురం విద్య, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో (Government Schools) అందించే మధ్యాహ్న భోజనంలో గుడ్డు (Midday Meal Egg Scam) మాయమవుతోంది. ఎప్పుడిస్తారో తెలీదు అస్సలు ఇస్తారో.. లేదో, కూడా తెలీదు. విషయం ఉన్నతాధికారుల నుంచి హెచ్ఎంల వరకు అందరికీ తెలిసినా ఎవ్వరూ నోరుమెదపరు అందరూ.. అందరే! బిల్లులు మాత్రం ఎంచక్కా ఇచ్చేస్తున్నారు. ఈ గుడ్డు దొంగల వ్యవహారంపై ఏకంగా అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి (MLC Ram Gopal Reddy) జిల్లా పరిషత్ వేదికగా ఆరోపణలు గుప్పించారు. జిల్లాలో సాగుతున్న గుడ్డ దోపిడీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కోడిగుడ్డు మాయం.!
'ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు మాయం చేసి, పేద పిల్లల కడుపు కొడుతున్నారు. తద్వారా కోట్లు దోచు కుంటున్నారు. ఇంత జరుగుతున్నా.. అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు. సరిదిద్దకపోతే.. కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్షకు కూర్చుంటా' అని ఎమ్మెల్సీ ధ్వజమెత్తడంతో.. జిల్లా విద్యాశాఖలో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనిపై కలెక్టర్ ఆనంద్ సీరియస్‌గా స్పందించారు. వెంటనే గార్లదిన్నె ఎంఈఓ-2 వెంకట రమణ నాయక్‌కు ఛార్జ్‌మెమోకు ఆదేశాలిచ్చారు. ఆ మేరకు విద్యాశాఖ అధికారులు జారీ చేశారు. కోడిగుడ్లు మాయంపై ఇతర శాఖల అధికారుతో కమిటీ వేసి.. విచారణ చేయిస్తామనీ, వాస్తవమని తేలితే చర్యలు తీసుకుంటామని సభలోనే కలెక్టర్ స్పష్టం చేశారు.
అందరూ కుమ్మక్కు..
మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు మాయం వ్యవహారానికి సంబంధించి పెద్ద తతంగమే సాగుతోందని తెలుస్తోంది. గుడ్డు సరఫరా కాంట్రాక్టర్ ఎవరో కూడా జిల్లా విద్యాశాఖాధికారులకు తెలీదని ఎమ్మెల్సీ ఆరోపించారు. అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో, ఇలా అయితే ఎలా పర్యవేక్షిస్తున్నారో అర్థం కావట్లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో సబ్ కాంట్రాక్టర్లు గుడ్లు సరఫరా చేస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. వారి ఆక్రమాలకు ఎంఈఓలు, హెచ్ఎంలు, ఎంఐఎస్‌కో కోఆర్డినేటర్లు, చివరకు పాఠశాలలో వంట ఏజెన్సీలు, హెల్పర్లు సైతం అండగా నిలుస్తున్నారనే ప్రచారం వస్తోంది. అవసరం మేరకు సరఫరా చేయకపోయినా చేసినట్లు చూపించి సబ్ కాంట్రాక్టర్లతో ఒప్పందం మేరకు అమ్యామ్యాలు దండుకుని, ఆన్‌లైన్ నమోదుచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పిల్లలు అయిష్టతతో ఆదాయం..
పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు రోజూ కోడిగుడ్డు తినడానికి ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. బాలికలు అసలు తినడం లేదని టీచర్లే అంటున్నారు. నిబంధనల మేరకు ఎవరైనా తినకపోయినా, అబ్సెంట్ అయిన పిల్లల వల్ల మిగిలిన గుడ్లను మిగులుగా చూపించాలి. వాటిని తీసేసి ఎంత అవసరమో అంతమేరకే తర్వాత ఇండెంట్ పెట్టాలి. హెచ్ఎంలు అలా చేయడంలేదని తెలుస్తోంది. విద్యార్థులు తినకపోయినా తిన్నట్లు చూపించి ఇండెంట్ పెడుతున్నారని విద్యాశాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. చిన్నసైజ్ గుడ్లు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వాటిని బయటకు సగం ధరకే విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ గుడ్ల స్వాహాపై ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేయడం, కలెక్టర్ సీరియస్‌గా తీసుకోవడం, ఎంఈఓ - 2కు చార్జ్ మెమో ఇవ్వడం, ఇతరశాఖల అధికారులతో విచారణకు హామీ ఇవ్వడంతో ఎంఈఓలు, హెచ్ఎంలలో కలవరం మొదలైంది. ఎప్పుడు, ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లా అధికారులకు సైతం నిద్ర కరువైంది.
ఈ వార్తలు కూడా చదవండి...
రెచ్చిపోయిన దొంగలు.. ఆలయంలో దొంగతనానికి యత్నించి..
ప్రయాణికులకు అలర్ట్.. విమానాల రాకపోకలకు ఆలస్యం
Read Latest AP News And Telugu News