Raghunandan Rao Fires on Congress: స్థానిక ఎన్నిక.. కాంగ్రెస్ కన్ఫ్యూజన్‌లో ఉంది.. రఘునందన్ రావు సెటైర్లు
ABN , Publish Date - Sep 25 , 2025 | 01:51 PM
దసరా సెలవుల్లో కూడా ఉద్యోగులతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పని చేయిస్తోందని.. ఈ ఆలోచనను విరమించుకోవాలని బీజేపీ మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు కోరారు. ఉద్యోగులను దసరా సెలవుల్లో కూడా పని చేయించడం సరికాదని చెప్పుకొచ్చారు.
సిద్దిపేట, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నిక (Local Elections)పై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) దోబూచులాడుతోందని బీజేపీ మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు (Raghunandan Rao) విమర్శించారు. 20నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏం చేయాలో అర్థం కానీ కన్ఫ్యూజన్‌లో ఉందని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అసమర్థతను, అవినీతిని, కుటుంబ పాలనను ఎండగడుతామని కాంగ్రెస్ చెప్పి అధికారంలోకి వచ్చిందని.. కానీ ఏం చేస్తోందని ప్రశ్నల వర్షం కురిపించారు. లక్ష కోట్లు కేసీఆర్ కుటుంబం నుంచి కక్కించి పేద ప్రజలకు అందిస్తామని కాంగ్రెస్ చెప్పలేదా అని ప్రశ్నించారు. నేడు డబ్బులు లేవని సంక్షేమ పథకాలు ఇవ్వలేని దుస్థితికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేరిందని ఆరోపించారు. పదేళ్లు బీఆర్ఎస్ పాలనలో దోసుకున్న సొమ్ముతో కొందరు ఆగడం లేదని మండిపడ్డారు ఎంపీ రఘునందన్ రావు.
బీఆర్ఎస్ నేతలు మీడియాను మేనేజ్ చేసి నోటికి వచ్చింది మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ(గురువారం) సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో పండిట్ దీన్‌దయాల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో రఘునందన్ రావు మాట్లాడారు. వర్షాలు బాగా కురిశాయని.. ఒక దశలో వానలు ఆగాలని అన్నదాతలు కోరుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రకృతి, పర్యావరణం ప్రకోపిస్తోందని తెలిపారు. మనుషుల ప్రవర్తన మారి మంచి బుద్ధి ప్రసాదించాలని నవరాత్రుల సందర్భంగా కనక దుర్గమ్మను కోరుకున్నానని పేర్కొన్నారు. దేశంలో జాతీయ రహదారులు తప్పా మిగతా రహదారులపై కనీసం కారు వెళ్లే పరిస్థితి లేదని తెలిపారు ఎంపీ రఘునందన్ రావు.
నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల రోడ్లు గుంతల మయంగా మారాయని వెల్లడించారు. దసరా సెలవులను ఉపాధ్యాయులు రద్దు చేసుకొని ఉద్యోగం చేయాలనే విధంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి చేస్తోందని ప్రశ్నించారు. దసరా సెలవుల కోసం ఊరు వెళ్లిన ఉపాధ్యాయులను ఉద్యోగం చేయాలని ఎందుకు అధికారులు కోరుతున్నారని నిలదీశారు. 42శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోందని.. ఇప్పటికీ కూడా అందుకు సంబంధించిన జీవో ఎందుకు పాస్ చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ జీవోపై ఎవరూ కోర్టుకి వెళ్తారో తెల్వని పరిస్థితిలో ఉద్యోగులను దసరా సెలవుల్లో కూడా పని చేయించడం సరికాదని చెప్పుకొచ్చారు. దసరా సెలవుల్లో కూడా ఉద్యోగులతో ప్రభుత్వం పని చేయిస్తోందని.. ఈ ఆలోచనను విరమించుకోవాలని కోరారు. తెలంగాణలో ఆడబిడ్డలకు ఎంతో ఇష్టమైన పెద్ద పండగ బతుకమ్మ, టీచర్లలో ఎక్కువ మంది మహిళలు ఉంటారని చెప్పుకొచ్చారు. దసరా సెలవుల్లో కూడా ఉపాధ్యాయులు పనిచేసే విధంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిన ఆలోచనను మరోసారి పునరాలోచన చేయాలని రఘునందన్ రావు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేటి అలంకారం శ్రీ కాత్యాయనీ దేవి
పార్టీ పరిశీలకులతో అగ్రనేతలు భేటీ
Read Latest Telangana News And Telugu News