Minister Ponguleti Counter on KCR: కేసీఆర్ ప్రభుత్వంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 06 , 2025 | 01:03 PM
కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఇళ్లు కడితే కమీషన్లు రావని తెలిసి మాజీ సీఎం కేసీఆర్ ఇళ్లను కట్టలేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కమీషన్లు వస్తాయని తెలిసి ఆ ప్రాజెక్టును చేపట్టారని విమర్శించారు.
వనపర్తి జిల్లా, సెప్టెంబరు6 (ఆంధ్రజ్యోతి): కల్వకుంట్ల కుటుంబం పదేళ్లలో భారీగా అవినీతికి పాల్పడిందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో 8 లక్షల 19 వేల కోట్ల రూపాయల అప్పుల భారం ప్రజలపై మోపిందని ఆక్షేపించారు. ఇవాళ(శనివారం) వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండలం మంగంపల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.
కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు తమ ప్రభుత్వం నెల నెల వడ్డీలు కడుతూనే.. అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెడ్లలా ముందుకు తీసుకుపోతున్నామని ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. పేదవారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 7 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని.. పాత రేషన్ కార్డుల్లో 17 లక్షల మంది పేర్లను చేర్చామని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సంవత్సరానికి రెండువేల డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చి ఉంటే అందరికీ ఇళ్లు వచ్చేవని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
ఇళ్లు కడితే కమీషన్లు రావని తెలిసి మాజీ సీఎం కేసీఆర్ ఇళ్లను కట్టలేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కమీషన్లు వస్తాయని తెలిసి ఆ ప్రాజెక్టును చేపట్టారని విమర్శించారు. కాళేశ్వరంలో కేసీఆర్ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. రాబోయే మూడు విడతల్లో ప్రతి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిచ్చి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నాపై, పార్టీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. హరీష్‌రావు ఫైర్
రికార్డు స్థాయిలో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం
Read Latest Telangana News and National News