Venkaiah Naidu: నాకు రాజకీయాల్లో నుంచి వైదొలగడం ఇష్టం లేదు.. వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 05 , 2025 | 02:14 PM
విలీనం-విభజన మన ముఖ్యమంత్రులు పుస్తకాన్ని నేటితరం యువత తప్పని సరిగా చదవాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ఈ పుస్తకం చదివితే నాయకుల పరిపాలన, విజ్ఞానం, వారి గురించి అన్ని విషయాలు తెలుస్తాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
హైదరాబాద్ ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): భాష విషయంలో నాయకుల తీరు మారాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) సూచించారు. ఇవాళ(మంగళవారం) సీనియర్ సంపాదకులు ఇనగంటి వెంకట్రావు రాసిన విలీనం-విభజన మన ముఖ్యమంత్రులు పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్‌రెడ్డి, పుస్తక రచయిత ఇనగంటి వెంకట్రావు, సీనియర్ జర్నలిస్టులు కట్టా శేఖర్ రెడ్డి, బండారు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు.
విలీనం - విభజన మన ముఖ్యమంత్రులు పుస్తకాన్ని నేటితరం యువత తప్పనిసరిగా చదవాలని సూచించారు. ఈ పుస్తకం చదివితే నాయకుల పరిపాలన, విజ్ఞానం, వారి గురించి అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పుకొచ్చారు. పత్రికా సమాజానికి దర్పణం లాంటిదని... ఈ సమాజంలో ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాలని ఆకాంక్షించారు. మనం వ్యూస్ కోసం న్యూస్ చేయకూడదని.. దానికోసమే కాలమ్స్ ఉన్నాయని, రాసుకోవడానికి అందులో వాళ్ల అభిప్రాయాలు చెప్పొచ్చని పేర్కొన్నారు. భాష విషయంలో రాజకీయ నాయకులు చాలా హుందాగా ప్రవర్తించాలని సూచించారు. చాలా మంది జర్నలిస్టులు కొత్తగా యూట్యూబ్‌లో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని.. పాత్రికేయంలో భాష చాలా ముఖ్యమని ఉద్ఘాటించారు వెంకయ్యనాయుడు.
తన జీవితంలో రెండు సార్లు కంటతడి పెట్టానని గుర్తుచేసుకున్నారు. ఒకటి తన అమ్మ గుర్తుకు వచ్చినప్పుడు... తాను తన అమ్మను చూడలేదని భావోద్వేగానికి గురయ్యారు. రెండోది పార్లమెంటరీ పార్టీ సమావేశానికి పిలిచి తనను ఉప రాష్ట్రపతిగా చేసినప్పుడు...తనకు రాజకీయాల్లో నుంచి వైదొలగడం ఇష్టం లేదని తెలిపారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తాను బీజేపీ ఆఫీస్‌కు పోలేదని వెల్లడించారు. తాను ఉప రాష్ట్రపతిగా దిగిపోయిన నాటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ ఆఫీస్ గుమ్మం తొక్కలేదని చెప్పుకొచ్చారు. ఉప రాష్ట్రపతిగా రిటైర్డ్ అయ్యాక యువత కోసం రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్
Read latest Telangana News And Telugu News