Kishan Reddy: వ్యవసాయ రంగం అభివృద్ధి దేశ ఆర్థిక ప్రగతికి మూలం: కిషన్‌రెడ్డి
ABN , Publish Date - Nov 04 , 2025 | 06:23 PM
దేశంలో ఎన్ని మార్పులు వచ్చినా.. వ్యవసాయం ఇప్పటికీ మన జీవన విధానంలో భాగమేనని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అగ్రి బిజినెస్ అవార్డులు ఇవ్వడం ద్వారా భారతదేశ వ్యవసాయ రంగానికి ఎనలేని సేవలు అందిస్తున్న రైతులు, ఇన్నొవేటర్స్, అగ్రిప్రెన్యూర్స్‌లని గౌరవించుకోవడమేనని పేర్కొన్నారు కిషన్‌రెడ్డి.
హైదరాబాద్, నవంబరు4 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఎన్ని మార్పులు వచ్చినా.. వ్యవసాయం (Agriculture Sector) ఇప్పటికీ మన జీవన విధానంలో భాగమేనని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) వ్యాఖ్యానించారు. అగ్రి బిజినెస్ అవార్డులు ఇవ్వడం ద్వారా భారతదేశ వ్యవసాయ రంగానికి ఎనలేని సేవలు అందిస్తున్న రైతులు, ఇన్నొవేటర్స్, అగ్రిప్రెన్యూర్స్‌లని గౌరవించుకోవడమేనని పేర్కొన్నారు. ఇవాళ(మంగళవారం) హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్‌లో అగ్రి బిజినెస్ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. దేశంలోని 54 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని చెప్పుకొచ్చారు కిషన్‌రెడ్డి.
వ్యవసాయ రంగం కీలక పాత్ర..
వ్యవసాయ రంగం దేశ జీడీపీలో 18 శాతం భాగస్వామ్యం కలిగి ఉందని వివరించారు. ఆత్మ నిర్భర భారత్ దిశగా దూసుకెళ్లేందుకు వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తోందని ఉద్ఘాటించారు. రైతులు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ బలంగా నమ్ముతారని నొక్కిచెప్పారు. అందుకే అనేక పథకాలు రైతులకు మేలు చేసేలా రూపొందించారని తెలిపారు. ఈ ఏడాది చైనాను దాటేసి 149 మిలియన్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో భారతదేశం ప్రపంచంలోనే తొలిస్థానంలో నిలిచిందని ఉద్ఘాటించారు. 2014 నుంచి 2015 మధ్యలో పాల ఉత్పత్తి 63 శాతం పెరిగిందని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ పాలు ఉత్పత్తి చేసే దేశంగా మనం నిలిచామని పేర్కొన్నారు కిషన్‌రెడ్డి.
పప్పు ధాన్యాల ఉత్పత్తిలో తొలిస్థానంలో నిలిచాం..
పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ప్రపంచలోనే తొలిస్థానంలో నిలిచామని వివరించారు. దేశంలో 26 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాల ఉత్పత్తి జరుగుతోందని వెల్లడించారు. కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా సరఫరా విషయంలో ఎన్ని ఇబ్బందులు తలెత్తినా ఆహార ధాన్యాలు సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. వేరే దేశాలకు కూడా భారతదేశం నుంచి ఎగుమతి చేశామని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో దేశంలోని 80 కోట్ల మందికి ఉచితంగా 5 కేజీల చొప్పున బియ్యం ఇస్తున్నామని తెలిపారు. పీఎం కిసాన్, పీఎం కృషి సించాయి యోజన వంటి అద్బుతమైన పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు కిషన్‌రెడ్డి.
రూ.4 లక్షల కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమ చేశాం..
2019లో పీఎం సమ్మాన్ నిధి యోజన ప్రారంభించినప్పటి నుంచి 11.8 కోట్ల మంది రైతులకు 21 విడతల్లో.. రూ.4 లక్షల కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమ చేశామని స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా చిన్న, మధ్య తరహా అన్నదాతలకు భరోసా దక్కిందని నొక్కిచెప్పారు. దళారుల ప్రమేయం లేకుండా రైతన్నలు లబ్ధి పొందుతున్నారని వివరించారు. 2014 నుంచి ఇప్పటివరకు వరి ధాన్యం కనీస మద్దతు ధర భారీగా పెంచామని వెల్లడించారు. జీఎస్టీ 2.0 ద్వారా రైతులకు ఉపయోగపడేలా ట్రాక్టర్లు, మెషీన్లపై భారీగా జీఎస్టీ తగ్గించామని ప్రకటించారు. జీఎస్టీ తగ్గించడంతో అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతోందని చెప్పుకొచ్చారు. సాగు ఖర్చు కూడా భారీగా తగ్గి, రైతుల ఆదాయం మరింత పెరుగుతుందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్స్ వంటి అగ్రి టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీపై డీసీపీ రియాక్షన్..
ఏం చేస్తారో చేసుకోండి.. సీఐతో వైసీపీ నేత దురుసు ప్రవర్తన
Read Latest Telangana News And Telugu News