Minister Uttam: ఇరిగేషన్‌ను నాశనం చేసింది కేసీఆరే.. మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్
ABN , Publish Date - Dec 21 , 2025 | 08:15 PM
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇరిగేషన్‌ను నాశనం చేసింది కేసీఆరేనని ఆరోపించారు.
హైదరాబాద్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కి (KCR) తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇరిగేషన్‌ను నాశనం చేసింది కేసీఆరేనని ఆరోపించారు. ఇవాళ(ఆదివారం) తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇరిగేషన్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు 90శాతం అబద్ధమని అన్నారు. కాళేశ్వరం తెలంగాణకు గుండెకాయ అన్నారని.. అది కూలిపోయిందని చెప్పుకొచ్చారు.
రూ.1. 80వేల కోట్లతో కట్టిన ప్రాజెక్టు వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం బ్యారేజీలు కూలిపోవడానికి కారణం.. కేసీఆరేనని ఫైర్ అయ్యారు. ప్రజల భవిష్యత్తును ఆయన తాకట్టు పెట్టారని ఆరోపించారు. కాళేశ్వరం నిర్మాణం తీరును డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సుప్రీంకోర్టు జడ్జి కూడా తప్పుపట్టారని ప్రస్తావించారు. కూలిపోయిన ప్రాజెక్టులు కట్టి ఇరిగేషన్ గురించి కేసీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
రూ.38,500 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రూ.లక్ష కోట్లకు ఎందుకు పెంచారని ప్రశ్నల వర్షం కురిపించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా పెంచారని ఆరోపించారు. రూ.18 వేల కోట్లతో సీతారామ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నా కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. రూ.లక్షల కోట్ల అప్పుతెచ్చి కూడా ప్రాజెక్టు పూర్తి చేయలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందున్న పెండింగ్ ప్రాజెక్టులు కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదు? అని ప్రశ్నించారు. SLBC, డిండి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో ప్రజలు అడుగుతున్నారని.. కేసీఆర్ వెంటనే సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చామని తేల్చిచెప్పారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడటం సరికాదని హితవు పలికారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
కృష్ణా జలాల కోసం గట్టిగా ట్రైబ్యునల్‌లో పోరాడుతున్నామని పేర్కొన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.7 వేల కోట్లు ఖర్చు పెట్టామని వివరించారు. ఈ ప్రాజెక్టుకు 90 టీఎంసీల కంటే తక్కువ అడగ లేదని అన్నారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు రద్దు చేసి రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ తప్పుల వల్లే ఇరిగేషన్ వ్యవస్థ నాశనమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమత్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నన్ను తిట్టడం.. అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానం
అందుకే కేసీఆర్ బయటకు వచ్చారు.. మధుయాష్కీ షాకింగ్ కామెంట్స్
Read Latest Telangana News and National News