Bomb Threat: నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు.. పోలీసులు అలర్ట్..
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:42 PM
నాంపల్లి కోర్టుకు గుర్తుతెలియని వ్యక్తి దగ్గరి నుంచి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ క్రమంలో వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యారు.
హైదరాబాద్, డిసెంబరు18 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు (Nampally Court) గుర్తుతెలియని వ్యక్తి పంపిన బాంబు బెదిరింపు (Bomb Threat) మెయిల్ తీవ్ర కలకలం రేపింది. మధ్యాహ్నం 2 గంటలకు కోర్టులో బాంబు పేలుతుందని మెయిల్‌లో పేర్కొనడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యి కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు.
పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బాంబ్ స్క్వాడ్‌ను హుటాహుటిన కోర్టుకు పంపించారు అధికారులు. న్యాయస్థానం చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. భద్రతా చర్యలలో భాగంగా కోర్టు పరిసరాల్లో ఉన్న న్యాయవాదులు, సిబ్బంది, ప్రజలను బయటకు తరలించారు. కోర్టు ప్రాంగణమంతా ఖాళీ చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అనుమానాస్పద వస్తువుల కోసం ప్రతి మూలను పరిశీలిస్తూ బాంబ్ స్క్వాడ్ తనిఖీలు కొనసాగిస్తోంది. పోలీసు అధికారులు మెయిల్ పంపిన వ్యక్తి వివరాలు గుర్తించేందుకు సైబర్ నిపుణులతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, భద్రతా చర్యలు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇటీవల వరుసగా బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తులు ఎవరు, ఎక్కడి నుంచి ఈ కాల్స్ , మెయిల్స్ పంపిస్తున్నారనే అంశాలపై సైబర్ నిపుణుల సహకారంతో సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఒకే తరహాలో వరుసగా జరుగుతున్న ఇలాంటి బెదిరింపు ఘటనలు ప్రజల్లో తీవ్ర భయాందోళనకు కారణమవుతున్నాయి.
ముఖ్యంగా న్యాయస్థానాలు, విమానాశ్రయాల వంటి కీలక ప్రాంతాలు లక్ష్యంగా మారడంతో భద్రతాపరమైన ఆందోళనలు మరింత పెరిగాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద సమాచారం ఏదైనా ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచించారు. భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తూ, ఇలాంటి బెదిరింపులకు చెక్ పెట్టేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పోలీసులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జడ్జిమెంట్‌పై సస్పెన్స్.. ఆ ఆలోచనలో స్పీకర్..!
ఐ బొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ.. కీలక అంశాలపై ఫోకస్
Read Latest Telangana News and National News