Minister Uttam Kumar: హరీశ్‌రావు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ఫైర్
ABN , Publish Date - Dec 29 , 2025 | 02:28 PM
కృష్ణా జలాల్లో తాము 90టీఎంసీలు డిమాండ్ చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తాము 45 టీఎంసీలు మాత్రమే అడిగామని హరీశ్‌రావు దుష్ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. అబద్ధాల పునాదులపై బీఆర్ఎస్ బతుకుతోందని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు(సోమవారం) నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సాగునీటి జలాలపై చర్చ జరిగింది. చర్చలో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) మాట్లాడారు. ఈ నేపథ్యంలో మాజీమంత్రి హరీశ్‌రావుపై మంత్రి ఉత్తమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్‌రావు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇరిగేషన్‌లో తానే మాస్టర్‌నని ఆయన అనుకుంటున్నారని విమర్శించారు. హరీశ్‌రావుకు అంత అహంకారం ఎందుకు? అని ప్రశ్నించారు.
ఎవరి హయాంలో ఏం జరిగిందో అంతా బయటపెడతామని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో తాము 90టీఎంసీలు డిమాండ్ చేశామని చెప్పుకొచ్చారు. తాము 45 టీఎంసీలు మాత్రమే అడిగామని హరీశ్‌రావు దుష్ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. అబద్ధాల పునాదులపై బీఆర్ఎస్ బతుకుతోందని ఎద్దేవా చేశారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతూ.. అదే నిజం అవుతుందనుకుంటున్నారని మండిడ్డారు. సీడబ్ల్యూకి రాసిన లేఖలో ఓ పేరాగ్రాఫ్‌ను అవుటాఫ్ కాంటెక్స్ట్ తీసుకొస్తున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణకు అన్యాయం జరిగేలా తానెందుకు లేఖ రాస్తా? అని ప్రశ్నించారు. సీడబ్ల్యూకి రాసిన లేఖలో ఒక భాగాన్నే చూపిస్తున్నారని.. కృష్ణా బేసిన్‌పై అసెంబ్లీలో ప్రెజెంటేషన్‌కు తాము సిద్ధమని స్పష్టం చేశారు. మేడిగడ్డ పునర్నిర్మాణం పనులకు డెడ్‌లైన్ పెట్టామని పేర్కొన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
బీఆర్ఎస్ నేతల చేతకాని తనాన్ని తమపై రుద్దవద్దని హితవు పలికారు. వారు ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సాగునీటి జలాలపై డీపీఆర్‌ను కేంద్రానికి పంపడానికి ఏడేళ్ల సమయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. డీపీఆర్ పంపే సమయానికి రూ.21 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పుకొచ్చారు. ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు..అన్యాయం చేస్తున్నామంటూ బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
హరీశ్‌రావును చూసి గోబెల్స్ కూడా సిగ్గుతో తలదించుకుంటారని ఎద్దేవా చేశారు. పాలమూరు - రంగారెడ్డిలో 90 టీఎంసీలకు ప్రతిపాదించారని గుర్తుచేశారు. 45 టీఎంసీల మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీల గోదావరి డైవర్షన్ అని వాడారని చెప్పుకొచ్చారు. వాళ్లు ఇచ్చిన జీవోనే తాము ప్రస్తావిస్తూ లేఖ రాశామని స్పష్టం చేశారు. తొలుత మైనర్ ఇరిగేషన్‌ను క్లియర్ చేయమని అడిగామని అన్నారు. పేజ్ -1లో ఇన్షీయల్‌గా చేయమని అడిగామని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో 7 టీఎంసీలకు ఒప్పుకుని వచ్చారని ప్రస్తావించారు. కేసీఆర్ హయాంలోని పదేళ్లలో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తిచేయలేకపోయారని ప్రశ్నించారు. తాము మాత్రం పూర్తిచేసి పాలమూరు ప్రాంతానికి నీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
కేవలం ఐదు నిమిషాలే.. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ సంచలన కామెంట్స్
Read Latest Telangana News And Telugu News