BRS chief KCR: కేవలం ఐదు నిమిషాలే.. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:03 AM
తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. అందరికంటే ముందే తన చైర్‌లో కూర్చున్న మాజీ సీఎం.. కాసేపటికే అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు.
హైదరాబాద్, డిసెంబర్ 29: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (Former CM KCR) అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. సభ ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే బీఆర్‌ఎస్ అధినేత తిరుగుపయనమయ్యారు. సంతాప తీర్మానాలు ముగిసిన వెంటనే కేసీఆర్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. కాగా.. ఈరోజు (సోమవారం) ఉదయం నందినగర్‌లోని నివాసం నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు కేసీఆర్. ఈ సందర్భంగా మాజీ సీఎంకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ఆపై కేసీఆర్‌ను ఎమ్మెల్యేలు సభలోకి తీసుకెళ్లారు. కేసీఆర్ వెళ్లిన కాసేపటికే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మిగతా సభ్యులు అందరికంటే ముందుగానే కేసీఆర్ వెళ్లి తన చైర్‌లో కూర్చున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ హాల్లోకి రాగానే కేసీఆర్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు. అలాగే సీఎం తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు. ఆపై సభ ప్రారంభం కాగానే కొద్దిసేపు మాత్రమే సభలో ఉన్నారు కేసీఆర్. తర్వాత మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బయటికి వచ్చారు. అనంతరం అసెంబ్లీ నుంచి తిరిగి నందినగర్ నివాసానికి గులాబీ బాస్ వెళ్లిపోయారు.
కేసీఆర్‌ను కలిసిన సీఎం రేవంత్
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ దగ్గరకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ దగ్గరికి వెళ్ళి బాగున్నారా అని సీఎం పలకరించగా.. తిరిగి బాగున్నాను అంటూ రేవంత్‌కు కేసీఆర్ సమాధానం ఇచ్చారు. అలాగే కేసీఆర్‌ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీపీఐ ఎమ్మెల్యే కునమనేని సాంబశివరావు కలిసి కరచాలనం చేశారు.
ఇవి కూడా చదవండి...
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ సంచలన కామెంట్స్
పోలీసులకే షాకిచ్చిన సైబర్ కేటుగాళ్లు
Read Latest Telangana News And Telugu News