Share News

KTR: నరాలను పోగులుగా చేసిన నేతన్నల నైపుణ్యానికి సెల్యూట్: కేటీఆర్

ABN , Publish Date - Aug 07 , 2025 | 10:55 AM

చేనేత కళాకారులందరికీ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుభాకాంక్షలు తెలిపారు. మగ్గాలతో అద్భుతాలు సృష్టించే సత్తా మన నేతన్నల సొంతమని ఉద్ఘాటించారు.

KTR: నరాలను పోగులుగా చేసిన నేతన్నల నైపుణ్యానికి సెల్యూట్: కేటీఆర్
Kalvakuntla Taraka RamaRao

హైదరాబాద్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): చేనేత కళాకారులందరికీ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (Kalvakuntla Taraka RamaRao) శుభాకాంక్షలు తెలిపారు. మగ్గాలతో అద్భుతాలు సృష్టించే సత్తా మన నేతన్నల సొంతమని ఉద్ఘాటించారు. అగ్గిపెట్టెలో కూడా పట్టే చీరలు నేసే నైపుణ్యం నా తెలంగాణ నేత కార్మికుల ప్రత్యేకత అని అభివర్ణించారు. తరతరాలుగా వస్తున్న వృత్తిని నమ్ముకొని చేనేత ప్రపంచంలో వారికంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న నా చేనేత అక్కాచెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు వందనమని ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ (X) వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.


సమైక్య పాలనలో సాలెల మగ్గం సడుగులిరిగిందని... బీఆర్ఎస్ హయాంలో నేతన్నలకు పునర్: వైభవం వచ్చిందని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. పనులు లేక, పొట్ట చేతపట్టుకొని సూరత్, భీవండిలకు వలస వెళ్లిన చేనేత కార్మికులను, వినూత్న పథకాలు ప్రవేశపెట్టి తిరిగి తెలంగాణకు రప్పించి, ఉపాధి కల్పించిన ఘనత కేసీఆర్‌దని ఉద్ఘాటించారు. చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, నేతన్న బీమా, బతుకమ్మ చీరలు, రుణమాఫీ, పెన్షన్లు వంటి ఎన్నో పథకాలతో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని నొక్కిచెప్పారు. నరాలను పోగులుగా, తమ రక్తాన్ని రంగులుగా, గుండెలను కండెలుగా మార్చి, చెమట చుక్కలను చీరలుగా మలిచి, మనిషికి నాగరికతను అద్దిన చేనేత కార్మికులందరికీ మాజీ మంత్రి కేటీఆర్ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజ్‌గోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నజర్

తెలంగాణ ఉద్యమ ఆయువుపట్టు గద్దర్‌

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 07 , 2025 | 11:01 AM