Kishan Reddy: బీసీ రిజర్వేషన్లతో బీజేపీకి సంబంధం లేదు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 06 , 2025 | 08:26 PM
సీఎం రేవంత్ రెడ్డి 31 నిమిషాల ప్రసంగంలో.. 50 శాతాని కంటే ఎక్కువ సమయం రాహుల్, సోనియా జపం చేయడానికే సరిపోయిందని కిషన్ రెడ్డి విమర్శించారు. బీసీ రిజర్వేషన్లు ఇస్తామని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు.. దాన్ని పూర్తిచేసుకోవాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ దే అని ఆయన ఉద్ఘాటించారు.
ఢిల్లీ : నగరంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న బీసీ ధర్నాపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. జంతర్‌మంతర్‌లో కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న సభ.. గాంధీ కుటుంబాన్ని పొగడటానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రాజకీయంగా ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకునేందుకు.. గాంధీ కుటుంబం అనుగ్రహం పొందాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ సభ పెట్టుకున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ దే బాధ్యత..
సీఎం రేవంత్ రెడ్డి 31 నిమిషాల ప్రసంగంలో.. 50 శాతం కంటే ఎక్కువ సమయం రాహుల్, సోనియా జపం చేయడానికే సరిపోయిందని కిషన్ రెడ్డి విమర్శించారు. బీసీ రిజర్వేషన్లు ఇస్తామని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు.. దాన్ని పూర్తిచేసుకోవాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ దే అని ఆయన ఉద్ఘాటించారు. అందుకోసం న్యాయపరమైన, చట్టపరమైన అంశాలపై దృష్టిసారించి, చిత్తశుద్ధితో పనిచేయాలని హితవు పలికారు.
కామారెడ్డి డిక్లరేషన్ సంగతేంటి..
కాంగ్రెస్ ప్రభుత్వం అది చేయలేక.. బట్టకాల్చి బీజేపీ మీద వేస్తామంటే చూస్తు ఊరుకోమని కిషన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. చట్టపరమైన, న్యాయపరమైన ప్రణాళిక లేకుండా.. కామారెడ్డి డిక్లరేషన్‌ను రాహుల్ గాంధీ ప్రకటించారని గుర్తు చేశారు. 18 నెలలు గడుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి డిక్లరేషన్‌లో పేర్కొన్న అంశాల అమలు ఊసెత్తడం లేదని ఆయన ప్రశ్నించారు.
విమర్శల జల్లు..
ప్రధాని నరేంద్ర మోదీని రేవంత్ రెడ్డి విమర్శిస్తే.. అది ఆకాశం మీద ఉమ్మేయడమే అని కిషన్ రెడ్డి విర్శించారు. వివిధ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి కానీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అన్నారు. రజకులు, గౌడ్లు.. ఇలా ఏ ఒక్క బీసీ వర్గాన్ని వదలకుండా అందరినీ కాంగ్రెస్ నిట్టనిలువునా మోసం చేసిందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే.. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బయటపడుతుందని నిర్వహించడం లేదన్నారు.
రిజర్వేషన్ల పేరుతో డ్రామాలు ఆడుతున్నారు తప్ప.. సీఎం రేవంత్‌కు బీసీలకు సాధికారత కల్పించే విషయంలో చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. తెలంగాణలో ధర్నా చేస్తే.. ఎవరూ పట్టించుకోరని.. ఢిల్లీకి వచ్చి పగటివేషాలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు అధికారంలో ఉన్నా.. మజ్లిస్ పార్టీ చెప్పినట్లు పనిచేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారికంగా 10% ముస్లింలను బీసీల్లో చేర్చి 42% రిజర్వేషన్ అమలు చేస్తే.. బీసీలకు రాజ్యాధికారం కష్టమేననేది తెలంగాణ సమాజానికి అర్థమైందన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ముస్లింలతో కూడిన బీసీ రిజర్వేషన్లను బీజేపీ అంగీకరించదని తేల్చి చెప్పారు. దేశంలో మోదీ నేతృత్వంలో ప్రజలకు సుస్థిరమైన పాలన అందుతోదని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు
ఈడీ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు