Share News

KCR: నదీ జలాల కోసం మరో ఉద్యమం.. కేసీఆర్ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Dec 21 , 2025 | 06:27 PM

కాంగ్రెస్ సర్కార్ బస్తీ దవాఖానాలను కూడా నిర్వీర్యం చేస్తోందని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని కూడా ఎందుకు నిలిపివేసిందని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం రైతులను రాచి రంపాన పెడుతోందని మండిపడ్డారు.

KCR: నదీ జలాల కోసం మరో ఉద్యమం.. కేసీఆర్ షాకింగ్ కామెంట్స్
Kalvakuntla Chandrasekhar Rao

హైదరాబాద్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): సమైక్యాంధ్రలో మహబూబ్‌నగర్‌ జిల్లా వివక్షకు గురైందని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Kalvakuntla Chandrasekhar Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. సమైక్యాంధ్రలో కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు కలిసి మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టుకు ద్రోహం చేశాయని ధ్వజమెత్తారు. తెలంగాణ నదీ జలాలకు బీఆర్ఎస్‌ మాత్రమే శ్రీరామరక్ష అని వ్యాఖ్యానించారు. తెలంగాణపై ఆర్తి బీఆర్ఎస్‌కు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు మరో ఉద్యమం చేపడదామని పిలుపునిచ్చారు. ఇవాళ(ఆదివారం) తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నేతలకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు కేసీఆర్.


ఈ సమావేశంలో పాలమూరుకు జరిగిన ద్రోహంపైనే చర్చించామని అన్నారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, 20 ఏళ్లు పాలించిన టీడీపీ.. మహబూబ్‌నగర్‌ జిల్లాకు ద్రోహం చేశాయని ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లో కృష్ణా నది 300 కిలోమీటర్లు ప్రవహిస్తోందని వివరించారు. 174 టీఎంసీలు మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రాజెక్టులకు రావాల్సి ఉందని తెలిపారు. విభజనతో మహబూబ్‌నగర్‌‌కు చాలా నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రతిపాదిత ప్రాజెక్టులను మార్చొద్దని SRCలో స్పష్టంగా ఉందని తెలిపారు. ఈ విషయంపై బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌కి కూడా అనేకసార్లు విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు కేసీఆర్.


దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీని అసెంబ్లీ వేదికగా ప్రశంసించామని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ మొత్తాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచానని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చేస్తోంది? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని కూడా కాంగ్రెస్‌ సర్కార్ ఎందుకు నిలిపివేసిందని నిలదీశారు. బస్తీ దవాఖానాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ రైతులను రాచి రంపాన పెడుతోందని మండిపడ్డారు. రైతులకు నీళ్లు ఇచ్చే చెక్‌ డ్యామ్‌లను పేల్చివేయడం దారుణమని వాపోయారు. తాము అధికారంలోకి వచ్చాక కూల్చినవాళ్లు పాతాళంలో ఉన్నా పట్టుకువస్తామని హెచ్చరించారు కేసీఆర్.


తమ హయాంలో పాలమూరు, నల్లగొండ జిల్లాలను అద్భుతంగా తీర్చిదిద్దామని వ్యాఖ్యానించారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పడావు పెట్టారు? అని ప్రశ్నించారు. ఇంకా ఎందుకు పూర్తి చేయలేదని.. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని నిలదీశారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుపై మండల, జిల్లాస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. కృష్ణా జలాల అంశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజీ పడిందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలు ఆవేశంగా ఉన్నారని అన్నారు. ప్రతిపక్షంగా మన బాధ్యతను నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. మరో 20 రోజుల్లో పాలమూరులో భారీ బహిరంగ సభ పెడతామని కేసీఆర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నన్ను తిట్టడం.. అవమానించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానం

అందుకే కేసీఆర్ బయటకు వచ్చారు.. మధుయాష్కీ షాకింగ్ కామెంట్స్

Read Latest Telangana News and National News

Updated Date - Dec 21 , 2025 | 06:58 PM